Birthing Pods | హైదరాబాద్, అక్టోబర్ 29 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): బ్రాయిలర్ కోళ్లను ఫారాల్లో పెంచినట్టు.. పుట్టబోయే బిడ్డలను కూడా అత్యాధునిక ఫారాల్లాంటి పెట్టెల్లో ఉంచి పెంచితే ఎలాగుంటుంది? అండం-శుక్రకణం సంయోగం నుంచి బిడ్డ జననం వరకు మొత్తం ప్రోగ్రామింగ్‌పై ఆధారపడి నచ్చిన ఫీచర్లతో బిడ్డను కంటే ఎలాగుంటుంది?? ఈ ఊహలను నిజం చేసే రోజులు దగ్గరలో ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. బర్తింగ్ పాడ్స్‌ను ఉపయోగించి సింథటిక్ వూంబ్ లేదా ఆర్టిషియల్ వూంబ్ (కత్రిమ గర్భం) ద్వారా ఇది సాధ్యమేనంటున్నారు.
మహిళ గర్భంతో సంబంధం లేకుండా కత్రిమ ఉమ్మనీళ్లు, బొడ్డుతాడును పోలిన నిర్మాణంతో రూపొందించిన గాజు సంచీలా (అండాకార పారదర్శక గాజు పెట్టె (బర్తింగ్ పాడ్)) కనిపించేదే ‘కత్రిమ గర్భం’. తల్లి గర్భంలో పిండానికి అందే అన్ని రకాల పోషకాలను, ఆక్సిజన్‌ను ప్రోగ్రామింగ్ సాయంతో కృత్రిమ గర్భంలోని పిండానికి సమపాళ్లలో అందిస్తారు. బిడ్డలో గుండె, మెదడు, ఇతర అవయవాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిన తర్వాత ఎలక్ట్రోడ్లనే బటన్ సాయంతో బయటకు తీసుకొస్తారు. 2017లో అమెరికాలోని ఫిలడెల్ఫియా పరిశోధకులు ‘బయోబ్యాగ్’ పేరిట కత్రిమ గర్భం ప్రొటోటైప్‌ను అభివృద్ధి చేశారు. కోడింగ్ దశలో ఇది విజయవంతంగా పనిచేసింది.
ప్రముఖ ఫిల్మ్ డైరెక్టర్, బయోటెక్నాలజిస్టు హాషీం అల్-ఘైలీ సింథటిక్ వూంబ్కు సంబంధించిన వీడియోను తయారు చేశారు. దీని ప్రకారం.. పిండాన్ని బర్తింగ్ పాడ్‌లో పెంచుతారు. అందుకోసం ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ పద్ధతిని ఉపయోగిస్తారు. దాదాపు 75 ల్యాబ్‌లలో 400 చొప్పున పెట్టెలు ఉంటాయి. ఏటా 30 వేలమంది పిల్లలను పుట్టించడమే లక్ష్యంగా ఈ ల్యాబ్‌లు పనిచేస్తాయి. ఈ పెట్టెలకు ఏఐ ఆధారిత సెన్సర్లు ఉంటాయి. వాటి సాయంతో పెట్టెలోని శిశువు గుండెకొట్టుకొనే వేగం, ఉష్ణోగ్రత, ఆక్సిజన్ స్థాయిలను తెలుసుకోవచ్చు. ఇందులో అమర్చిన కెమెరా సాయంతో గర్భంలోని జన్యుపరమైన సమస్యలు తెలుసుకొని నియంత్రించవచ్చు. ఎప్పటికప్పుడు గర్భం పెరుగుదలను చూడొచ్చు. తల్లిదండ్రులు బిడ్డ పెరుగుదలను చూసేలా యాప్ ద్వారా అనుసంధానిస్తారు. బిడ్డను బయటకు తీయాలంటే ఆ బర్తింగ్ పాడ్‌పై ఉండే బటన్ నొక్కి చేతిలోకి తీసుకోవటమే. ఈ వీడియోను ‘ఎక్టోలైఫ్ ఆర్టిఫిషియల్ వూంబ్ ఫెసిలిటీ’ కోసం హాషీం రూపొందించారు.
నెలలు నిండని, అవయవాలు అభివృద్ధి చెందకుండా ముందుగా పుట్టిన పిల్లల కోసం వెస్టర్న్ ఆస్ట్రేలియా యూనివర్సిటీ పరిశోధకులు ఓ కత్రిమ గర్భాన్ని ఇదివరకే సృష్టించారు. ముఖ్యంగా 28 వారాలు నిండని పిల్లల కోసం దీన్ని తీసుకొచ్చారు. ఇది సత్ఫలితాలనిచ్చింది. ఇక, సింథటిక్ వూంబ్ టెక్నిక్కు సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ కుబేరులైన ముగ్గురు వ్యాపార దిగ్గజాలు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, ఈ-కామర్స్ సంస్థ గుమ్రోడ్ వ్యవస్థాపకుడు సాహిల్ లావింగియా, క్రిప్టో కరెన్సీ కంపెనీ ఎథేరియమ్ వ్యవస్థాపకుడు విటాలిక్ బ్యూటరిన్ ఆసక్తి కనబరుస్తుండటం గమనార్హం.
జననాల్లో అనూహ్య పెరుగుదల నమోదైతే ఆహార సంక్షోభం, వనరుల విధ్వంసం జరుగుతుంది. జననాల రేటులో తగ్గుదల నమోదైతే పనిచేసే యువతరం తగ్గిపోయి.. వృద్ధుల శాతం పెరిగిపోతుంది. ఫలితంగా ప్రపంచదేశాలు ఆర్థిక సంక్షోభాన్ని చవిచూస్తాయి. దీనికి చెక్ పెట్టే ప్రత్యామ్నాయమే సింథటిక్ వూంబ్. సంతానం ఎప్పుడు కావాలో, పిల్లల్ని ఎప్పుడు కనాలో, ఎందరిని కనాలో ప్రోగ్రామింగ్ ద్వారా టైమ్‌ను ఫిక్స్ చేసుకొనే వెసులుబాటు ఈ కృత్రిమ గర్భంలో ఉంటుంది.
బర్తింగ్ పాడ్‌లో పెరుగుతున్న పిండం ఏదైనా జన్యుపరమైన సమస్యలను ఎదుర్కొన్నట్టు అనిపించినా, లేదా బిడ్డ రంగు, ముఖం, ముక్కు ఇలా బిడ్డ ఫీచర్లు మనకు నచ్చినట్టు కావాలనుకొన్నా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సెన్సర్ల సాయంతో ప్రత్యేక ప్రోగ్రామింగ్ కోడ్ ద్వారా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుంది. తద్వారా అవయవ లోపంతో బిడ్డ పుట్టే ప్రమాదం అనేది ఉండదు. కాగా పూర్తిస్థాయి ‘కత్రిమ గర్భాన్ని’ తయారు చేయాలంటే మరో పదేండ్లు పట్టొచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.