Swati Maliwal case : ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతిమాలివాల్‌పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగిసింది. దాంతో ఢిల్లీ పోలీసులు ఆయనను తీస్ హజారీ కోర్టులో హాజరుపర్చారు. తదుపరి విచారణ కోసం మరో 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు.
దాంతో కోర్టు బిభవ్‌కుమార్ జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 16 వరకు పొడిగించింది. కేజ్రీవాల్ నివాసానికి వెళ్లిన తనపై బిభవ్ కుమార్ భౌతిక దాడికి పాల్పడ్డాడని స్వాతి మాలివాల్ ఈ ఏడాది మే 16న పోలీసులకు ఫిర్యాదు చేసింది. మే 13న తనపై దాడి జరిగిందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. మే 18న పోలీసులు బిభవ్‌ను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయనను ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు.
కాగా, స్వాతి మాలివాల్‌పై తాను ఎలాంటి భౌతిక దాడికి పాల్పడలేదని, తనపై ఆమె తప్పుడు కేసు పెట్టారని బిభవ్ కుమార్ చెబుతున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా ఆప్ నాయకులంతా కూడా బిభవ్‌కుమార్ నిర్దోషి అని నమ్ముతున్నారు. స్వాతి మాలివాల్ బీజేపీ ట్రాప్‌లో పడి తప్పుడు కేసు పెట్టిందని ఆరోపిస్తున్నారు. ఆ మేరకు మే 13న స్వాతిమాలివాల్ కేజ్రీవాల్ నివాసం దగ్గర భద్రతాసిబ్బందికి వార్నింగ్ ఇస్తున్న దృశ్యాలను ఆప్ షేర్ చేసింది.