బెంగళూరు: జనరల్ సర్జన్ అయిన డాక్టర్, ఆపరేషన్ సందర్భంగా ఇచ్చే మత్తు మందును తన భార్యపై ప్రయోగించాడు. స్కిన్ డాక్టర్ అయిన ఆమెను అనుమానం రాకుండా హత్య చేశాడు. (doctor kills wife) ఆమె సోదరి అనుమానంతో పోస్ట్‌మార్టం నిర్వహించగా ఈ విషయం బయటపడింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. సర్జన్ అయిన డాక్టర్ మహేంద్ర రెడ్డి, చర్మవ్యాధి నిపుణురాలు డాక్టర్ కృతికా ఎం రెడ్డి, విక్టోరియా హాస్పిటల్లో వైద్యులుగా పనిచేస్తున్నారు. 2024 మే 26న వారిద్దరికి వివాహం జరిగింది.
కాగా, పెళ్లైన కొన్ని నెలల తర్వాత డాక్టర్ కృతికా అనారోగ్యానికి గురైంది. మారతహళ్లిలోని తండ్రి ఇంటికి వెళ్లింది. అక్కడున్న ఆమె ఈ ఏడాది ఏప్రిల్ 23న కుప్పకూలింది. ఈ విషయం తెలుసుకున్న భర్త మహేంద్ర రెడ్డి అక్కడకు చేరుకున్నాడు. చికిత్స పేరుతో రెండు రోజుల పాటు ఇంట్రావీనస్ ఇంజెక్షన్లు ఇచ్చాడు. ఆమె ఆరోగ్యం విషమించడంతో సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే కృతికా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
మరోవైపు కృతికా అనారోగ్యంతో చనిపోయినట్లు పోలీసులు భావించారు. అయితే ఆమె సోదరి అయిన డాక్టర్ నిఖిత అనుమానం వ్యక్తం చేసింది. కృతికా మరణంపై పూర్తిగా దర్యాప్తు చేయాలని పోలీసులను కోరింది. దీంతో ఆమె మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు.
కాగా, ఆపరేషన్ సందర్భంగా వినియోగించే మత్తు మందు అయిన ప్రొపోఫోల్ బహుళ అవయవాల్లో ఉన్నట్లు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదిక తాజాగా నిర్ధారించింది. దీంతో అక్టోబర్ 14న కృతిక తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మరోవైపు భార్య మరణం తర్వాత ఉడిపిలోని మణిపాల్‌లో నివసిస్తున్న మహేంద్ర రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపరేషన్ థియేటర్, ఐసీయూలో ఉండే మత్తు మందు అయిన ప్రొపోఫోల్ను భార్య హత్య కోసం అతడు ఎలా సేకరించాడు, తన వైద్య పరిజ్ఞానాన్ని ఎలా వినియోగించాడు అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, మహేంద్ర కుటుంబానికి నేర చరిత్ర ఉన్నదని దర్యాప్తులో పోలీసులు తెలుసుకున్నారు. కవల సోదరుడైన డాక్టర్ నాగేంద్ర రెడ్డిపై 2018లో హాల్ పోలీస్ స్టేషన్లో మోసం, క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఆ ఫిర్యాదుదారుడి కుటుంబాన్ని బెదిరించారనే ఆరోపణలతో మహేంద్ర, మరో సోదరుడు రాఘవ రెడ్డిని 2023లో నమోదైన కేసులో సహ నిందితులుగా చేర్చారు.
అయితే పెళ్లి సమయంలో కేసుల వివరాలను మహేంద్ర రెడ్డి దాచినట్లు కృతిక కుటుంబం ఆరోపించింది. ప్రముఖ చర్మవ్యాధి నిపుణురాలైన ఆమె తన కలల క్లినిక్ ‘స్కిన్ అండ్ స్కాల్పెల్’ను మే 4న ప్రారంభించాలనుకున్నదని వెల్లడించారు.
Also Read:
Watch: ‘జై శ్రీరామ్’ నినాదాలు చేసిన ముస్లిం మహిళా పోలీస్ అధికారిణి.. ఎందుకంటే?
Watch: ఏనుగు తోక లాగిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?