Delhi Blast Case | ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కార్ బాంబ్ బ్లాస్ట్‌పై ఎన్ఐఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో పోలీసులు పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు చెందిన ఓ సర్జన్‌ను పోలీసులు అరెస్టు చేయగా.. పశ్చిమ బెంగాల్లో ఎంబీబీఎస్ స్టూడెంట్ను ఎన్ఐఏ అరెస్టు చేసింది. బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్‌కు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి జనిసూర్ అలియాస్ నిసార్ ఆలంను ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఉగ్రవాద సంస్థలతో అతనికి సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో అరెస్టు చేసినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. నిసార్ హర్యానాలోని అల్-ఫలా యూనివర్సిటీ విద్యార్థి కాగా.. లూధియానాలో నివాసం ఉంటున్నాడు. అతని పూర్వీకుల ఇల్లు దల్ఖోలా సమీపంలోని కోనల్ గ్రామంలో ఉంది.
సమాచారం ప్రకారం.. ఓ కార్యక్రమానికి వెళ్లివస్తుండగా సూరజ్‌పూర్ మార్కెట్లో నిసార్‌ను అరెస్టు చేశారు. అతని మొబైల్ లొకేషన్ డేటా ఆధారంగా అధికారులు అతని కదలికలపై నిఘా వేశారు. అతని నుంచి డిజిటల్ డివైజెస్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో ఇటీవల జరిగిన బాంబు దాడికి సంబంధించి ప్రశ్నించేందుకు నిసార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. అయితే, పేలుడుతో నిసార్‌కు ఉన్న ప్రత్యక్ష సంబంధాలున్నాయా? అన్నదానిపై ఈడీ ఇంకా స్పష్టం చేయలేదు. అయితే, ఎంబీబీఎస్ స్టూడెంట్ నుంచి డిజిటల్ డివైజ్లతో పాటు పలు పత్రాలను స్వాధీనం చేసుకుంది.
విచారణ సమయంలో నిసార్ తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. ఆ తర్వాత అతన్ని అధికారికంగా అరెస్టు చేశారు. విచారణ కోసం అతన్ని సిలిగురికి తీసుకెళ్లనున్నారు. నిసార్ అరెస్టుపై కుటుంబ సభ్యులు స్పందించారు. నిసార్ బంధువులు మాట్లాడుతూ అతనికి చదువుకే ప్రాధాన్యం ఇస్తాడని.. ఎలాంటి చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడలేదని చెప్పారు. ఇదిలా ఉండగా పంజాబ్ పఠాన్‌కోట్‌కు చెందిన ఓ వైద్యున్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. 45 ఏళ్ల సర్జన్ రెండు సంవత్సరాలకు పైగా పఠాన్‌కోట్‌లోని ఒక ప్రైవేట్ వైద్య కళాశాల-ఆసుపత్రిలో పనిచేస్తున్నారని వారు తెలిపారు.
గతంలో హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలోని అల్ ఫలా యూనివర్సిటీలో పని చేశారు. వైట్‌కాలర్ టెర్రర్ మాడ్యూల్ కేసులో ప్రధాన అనుమానితులతో డాక్టర్‌కు సంబంధాలున్నట్లుగా అనుమానిస్తున్నారు. ఈ నెల 10న జరిగిన బాంబు పేలుడులో 13 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో దేశవ్యాప్తంగా పలు నగరాలతో దర్యాప్తు చేస్తున్నది. ఢిల్లీ, ముంబయిలో అనుమానాస్పద సంబంధాల నేపథ్యంలో ముర్షిదాబాద్ నివాసి మొయినుల్ హసన్ ఇంటిపై ఏజెన్సీ ఇటీవల దాడి చేసింది. అయితే, నిసార్పై అభియోగాలు, ఆధారాలపై ఇంకా ఎన్ఐఏ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.