న్యూఢిల్లీ: వ్యక్తిగత స్వేచ్ఛకు రాజ్యాంగం ఇచ్చిన హామీని సుప్రీంకోర్టు మరింత బలోపేతం చేసింది. మహిర్ రాజేవ్ షా వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో తీర్పు చెప్తూ, అరెస్టయిన ప్రతి వ్యక్తికి అరెస్ట్‌కు కారణాలను లిఖితపూర్వకంగా, ఆ వ్యక్తికి అర్థమయ్యే భాషలో తప్పనిసరిగా తెలియజేయాలని స్పష్టం చేసింది. నేర స్వభావంతో కానీ, సంబంధిత చట్టంతో కానీ సంబంధం లేకుండా ఈ వివరాలను అరెస్టయిన వ్యక్తికి రాతపూర్వకంగా అందజేయాలని తెలిపింది.
ఒకవేళ అరెస్ట్ చేసేటపుడు లేదా అరెస్ట్ చేసిన తర్వాత అందుకు కారణాలను అరెస్ట్ చేసిన అధికారి/వ్యక్తికి లిఖితపూర్వకంగా తెలియజేయలేకపోయినపుడు, ఆ పనిని మౌఖికంగా చేయాలని తెలిపింది. ఆ కారణాలను లిఖితపూర్వకంగా సమంజసమైన సమయంలో తెలియజేయాలని చెప్పింది. అది కూడా కాని పక్షంలో, అరెస్టయిన వ్యక్తిని మేజిస్ట్రేట్ సమక్షంలో హాజరుపరుస్తూ, రిమాండ్ ప్రొసీడింగ్స్ జరగడానికి కనీసం రెండు గంటల ముందు రాతపూర్వకంగా ఆ కారణాలను అరెస్టయిన వ్యక్తికి తెలియజేయాలని వివరించింది.
దీనిని పాటించకపోతే, వ్యక్తిని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత రిమాండ్‌కు తరలించడం చట్టవిరుద్ధమవుతాయని, ఆ వ్యక్తిని విడుదల చేయవచ్చునని స్పష్టం చేసింది. అయితే, ఈ విధంగా విడుదలైన తర్వాత, రిమాండ్ లేదా కస్టడీ అవసరమైతే, అందుకు కారణాలు, అవసరం గురించి వివరిస్తూ దరఖాస్తు చేయవచ్చునని తెలిపింది. ఇంతకుముందు పేర్కొన్న గడువులోగా అరెస్ట్‌కు కారణాలను ఎందుకు తెలియజేయలేదో వివరిస్తూ, అరెస్ట్‌కు కారణాలను తెలియజేస్తూ దరఖాస్తు చేయవచ్చునని చెప్పింది. ఈ దరఖాస్తును స్వీకరించిన మేజిస్ట్రేట్ సత్వరమే, ఓ వారం రోజుల్లో విచారణ జరపాలని తెలిపింది.