Supreme Court | పౌరసత్వ చట్టం 1955లోని సెక్షన్‌ఏ రాజ్యాంగబద్ధతను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సమర్థించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోమిశ్రా ధర్మాసనం 4:1 మెజారిటీతో రాజ్యాంగబద్ధతను సమర్థిస్తూ గురువారం తీర్పును వెలువరించింది. అయితే, న్యాయమూర్తుల్లో జస్టిస్ పార్దివాలా మాత్రమే రాజ్యాంగ విరుద్ధమంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. విదేశీయులను భారత పౌరులుగా గుర్తించినా.. పదేళ్ల వరకు ఓటేసే హక్కు ఉండదన్నారు. బంగ్లాదేశ్ (గతంలో తూర్పు పాకిస్థాన్) నుంచి శరణార్థుల రాక అసోం జనాభా సమతౌల్యతను తీవ్రంగా ప్రభావితం చేసిదంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6ఎ రాష్ట్రంలోని అసలైన నివాసితుల రాజకీయ, సాంస్కృతిక హక్కులను ఉల్లంఘించిందని పిటిషన్లు ఆరోపించారు. విచారణ సందర్భంగా సీజేఐ డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ అక్రమ వలసలకు అసోం అకార్డ్ రాజకీయ పరిష్కారమని.. సెక్షన్-6ఎ అనేది చట్టబద్ధమైన మార్గమని పేర్కొన్నారు. నిబంధనలు రూపొందించేందుకు మెజార్టీతో కూడిన పార్లమెంట్‌కు ఆ శక్తి ఉందన్నారు.
మానవీయ ఆందోళనలను పరిష్కరించడంతోపాటు స్థానికుల ప్రయోజనాలను కాపాడే సమతౌల్యత సెక్షన్‌కు ఉందని.. ఇందులో కటాఫ్ డేట్‌గా నిర్ణయించిన 1971 మార్చి 25 అనేది సరైనదేనన్నారు. ఎందుకంటే అప్పటికే బంగ్లాదేశ్ యుద్ధం ముగిసిందని. బంగ్లాదేశ్ యుద్ధం నేపథ్యంలోనే ఈ సెక్షన్ తీసుకొచ్చిన విషయాన్ని చెబుతోందని.. ఈ సెక్షన్ అంత ఎక్కువగా జనాభాను కలుపుకోలేదని.. మరీ తక్కువగాను విలీనం చేసుకోలేదని సీజేఐ వ్యాఖ్యానించారు. పౌరసత్వ చట్టం 1955 సెక్షన్6ఎ మేరకు 1966 జనవరి నుంచి 1971 మార్చి 25లోపు అసోంకు వచ్చిన వలసదారులు పౌరసత్వం కోరవచ్చు. ఈ రూల్‌ని 1985లో అసోం అకార్డ్ తర్వాత తీసుకువచ్చారు. అసోంలోకి బంగ్లాదేశ్ వలసలపై ఉద్యమించినవారితో కేంద్రప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఇది. దీని చట్టబద్ధతపై అసోంలోని కొన్ని స్థానిక గ్రూపులు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. రాజ్యాంగ పీఠికకు విరుద్ధమని, పౌరహక్కుల ఉల్లంఘనతో పాటు రాజకీయ హక్కులను హరించడమేనని ఆయా గ్రూపులు వాదించాయి.