Supreme Court | న్యూఢిల్లీ : చట్టాలు ఉన్నది చెట్లను కాపాడటానికే కానీ, వాటిని నరికివేయడానికి కాదని సుప్రీంకోర్టు బుధవారం చెప్పింది. అనధికారిక చెట్ల నరికివేత, ఢిల్లీ చెట్ల పరిరక్షణ చట్టం, ఇతర చట్టాల అమలుకు సంబంధించిన అంశాలపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విచారణ జరిపింది. పర్యావరణవేత్త ఎంసీ మెహతా 1985లో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) నేపథ్యంలో ఈ విచారణ జరిగింది.
చెట్ల సంఖ్యను లెక్కగట్టి, వాటిని పరిరక్షించేందుకు చేపట్టవలసిన చర్యలపై దృష్టి సారిస్తామని ధర్మాసనం తెలిపింది. విచక్షణ లేకుండా చెట్ల నరికివేతకు అనుమతులు ఇవ్వకుండా అధికారులు తీసుకుంటున్న చర్యలను పరిశీలిస్తామని చెప్పింది. దీనికోసం ఓ నిబంధనావళిని రూపొందిస్తామని తెలిపింది. తదుపరి విచారణ నేడు కొనసాగుతుంది.