Supreme Court | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య కేసును సుప్రీంకోర్టు బుధవారం విచారించనున్నది. ఈ కేసులో ఈ నెల 20న కోల్‌కతా కోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. నిందితుడు సంజయ్ రాయ్‌కి జీవిత ఖైదు విదించింది. నిందితుడికి మరణశిక్ష విధించాలనే డిమాండ్ల మధ్య.. తాజాగా ఈ కేసును సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నది. ఈ కేసులో దర్యాప్తు ప్రక్రియపై మృతురాలి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుప్రీంకోర్టు తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌ను సైతం సమీక్షించనున్నారు. దర్యాప్తులో సరిగా జరుగలేదని.. తమకు న్యాయం జరిగేలా కేసును మరింత నిశితంగా దర్యాప్తు చేయాలని కోరారు. గతేడాది ఆగస్టు 9న ఆర్జీ కర్ ఆసుపత్రిలోని సెమినార్ హాల్లో ట్రైనీ డాక్టర్ శవమై కనిపించింది.
ఆ తర్వాత మరుసటి రోజే పోలీసులు సంజయ్ రాయ్‌ని అరెస్టు చేశారు. ఆ తర్వాత సీబీఐ కేసు విచారణ చేపట్టింది. సంజయ్ రాయ్ చివరకు దోషిగా నిర్దారిస్తూ ఛార్జిషీట్ దాఖలు చేసింది. సుప్రీం కోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకొని విచారించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. సంజయ్ రాయ్‌కి జీవిత ఖైదును విధిస్తూ సిల్దా కోర్టు న్యాయమూర్తి అనిర్బన్ దాస్ తీర్పును వెలువరించారు. అయితే, ఈ కేసు అరుదైన కేసు కిందకు రాదని అభిప్రాయపడ్డారు. కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బెంగాల్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. నిందితుడికి మరణ శిక్ష విధించాలంటూ అప్పీల్ చేయగా.. విచారణకు ఆమోదం తెలిపింది. మర వైపు బాధితురాలి తల్లిదండ్రులు కోర్టు తీర్పుపై అసహనం వ్యక్తం చేశారు. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని స్పష్టం చేసింది. నేరంలో భాగమైన మిగతా వారిని వదిలిపెట్టారని, ఇందులో కుట్ర ఉందని ఆరోపించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.