న్యూఢిల్లీ: 2002లో జరిగిన గోద్రా రైలు ఘటనపై.. ఫిబ్రవరి 13వ తేదీన విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. గుజరాత్ ప్రభుత్వంతో పాటు అనేక మంది దాఖలు చేసిన పిటీషన్లపై విచారణ చేపట్టనున్నది. ఈ కేసు విచారణకు మరో తేదీని ఇవ్వబోమనని జస్టిస్ జేకే మహేశ్వరి, అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం తెలిపింది.
2002, ఫిబ్రవరి 27వ తేదీన సబర్మతి రైలుకు చెందిన ఎస్-6 బోగీలో చెలరేగిన మంటల్లో సుమారు 59 మంది ప్రయాణికులు మరణించారు. ఆ కేసులో 2017లో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ అనేక మంది సుప్రీంలో అప్పీల్ చేసుకున్నారు. జీవిత ఖైదు శిక్ష పడిన 11 మంది నిందితులకు మరణశిక్ష విధించాలని కోరుతూ గత ఏడాది ఫిబ్రవరిలో గుజరాత్ సర్కారు సుప్రీంను ఆశ్రయించింది.
అయితే గురువారం విచారణ సమయంలో ఓ నిందితుడి తరపున లాయర్ హాజరయ్యారు. కానీ ఆధారాలు సమర్పించలేకపోయారు. గత ఏడాది నుంచి ఈ కేసును ఇప్పటి అయిదు సార్లు వాయిదా వేశానని, ఇక మళ్లీ వాయిదా వేయబోమని జస్టిస్ మహేశ్వరి తెలిపారు. కొందరు నిందితులకు చెందిన క్షమాభిక్ష పిటీషన్లు ప్రస్తుతం పెండింగ్లో ఉన్నట్లు సుప్రీంకు లాయర్ తెలిపారు. గుజరాత్ ప్రభుత్వ అప్పీల్పై ముందుగా విచారణ చేపట్టాలని సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే కోరారు.