న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్(Uttarakhand)లో భారీ స్థాయిలో అటవీ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. ఆ అంశంపై దాఖలైన పిటీషన్‌ను ఇవాళ సుప్రీంకోర్టు స్వీకరించింది. అటవీ భూముల్ని ఆక్రమిస్తుంటే, స్థానిక రాష్ట్ర ప్రభుత్వం మూగ ప్రేక్షకుడిలా కూర్చున్నదని సుప్రీం ధర్మాసనం పేర్కొన్నది. అటవీ భూముల ఆక్రమణ కేసును సుమోటోగా స్వీకరిస్తున్నట్లు కోర్టు చెప్పింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్‌ను విచారించింది. ఎంక్వైరీ కమిటీ వేసి, ఆ రిపోర్టును సమర్పించాలని ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రటరీని ధర్మాసనం ఆదేశించింది.
కండ్ల ముందే అటవీ భూమిని లాగేసుకుంటుంటే, ఉత్తరాఖండ్ అధికారులు మూగ ప్రేక్షకుల్లా ఉండడం షాక్‌కు గురి చేస్తున్నదని, అందుకే దీన్ని సుమోటో కేసుగా స్వీకరిస్తున్నట్లు కోర్టు చెప్పింది. చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ కన్జర్వేషన్ సెక్రటరీ నివేదిక ఇచ్చే వరకు థార్డ్ పార్టీ ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దు అని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. నివాసిత ఇండ్ల మినహా ఖాళీ భూములను అటవీశాఖ తమ ఆధీనంలోకి తీసుకోవాలని కోర్టు తన ఆదేశాల్లో వెల్లడించింది. అనితా ఖండ్వాల్ దాఖలు చేసిన పిటీషన్‌పై కోర్టు వాదనలు చేపట్టింది.