న్యూఢిల్లీ, డిసెంబర్ 2: అవినీతి కేసులో బెయిల్పై విడుదలైన డీఎంకే నేత సెంథిల్ బాలాజీ.. కొద్ది గంటల్లోనే తమిళనాడు ప్రభుత్వంలో మళ్లీ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అసలు అక్కడ ఏం జరుగుతున్నదని ప్రశ్నించింది. ఈ కేసులో సాక్షులందరూ కచ్చితంగా ప్రభావితమవుతారన్న సందేహాలు అందరిలోనూ కలుగుతాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సెంథిల్ బాలాజీకి బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పును రీకాల్ చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం విచారిస్తూ, పై వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది. ‘అతడి బెయిల్ రద్దు చేయటం గురించి మళ్లీ విచారణ జరిపేది లేదు. కానీ సాక్షులు ప్రభావితం అవుతారన్నది పరిగణlలోకి తీసుకొని, మళ్లీ విచారణ జరుపుతాం’ అని ధర్మాసనం పేర్కొన్నది. 49 ఏండ్ల సెంథిల్ బాలాజీ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2011-2015లో రవాణా మంత్రిగా పనిచేసిన అతడిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో సెప్టెంబర్లో బెయిల్ లభించిన మరుసటి రోజే స్టాలిన్ సర్కార్లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.