Supreme Court : సమయ్ రైనా (Samay Raina) తోపాటు మరో నలుగురు కమెడియన్ల (Comedians) కు సుప్రీంకోర్టు (Supreme Court) సమన్లు జారీచేసింది. దివ్యాంగులను కించపర్చేలా వ్యాఖ్యలు చేసినందుకు వారికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. కోర్టు ముందు స్వయంగా హాజరై ఆ అనుచిత వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వ్యక్తిగతంగా హాజరుకాకపోతే తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
దివ్యాంగులను కించపర్చేలా ఉన్న డిజిటల్ మీడియా ప్రసారాలకు అడ్డుకట్ట వేయాలని, దివ్యాంగుల హక్కులు, గౌరవానికి భంగం కలుగకుండా మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ క్యూర్ SMA ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రతివాదులైన ఐదుగురు కమెడియన్స్‌కు సమన్లు జారీచేసింది.
సమయ్ రైనాతో పాటు నోటీసులు అందుకున్న కమెడియన్లు నలుగురిలో విపుల్ గోయెల్, బాలరాజ్ పరంజీత్ సింగ్ ఘాయ్, సోనాలీ థాకర్ అకా సోనాలీ ఆదిత్య దేశాయ్, నిషాంత్ జగదీశ్ తన్వర్ ఉన్నారు. వీరంతా కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. లేదంటే కఠిన పరిణామాలు ఉంటాయని హెచ్చరిక చేసింది.