Supreme Court | యూపీలోని లఖింపూర్ హింస కేసులో సాక్షులను బెదిరించారన్న ఆరోపణలను సుప్రీంకోర్టు సీరియస్‌గా తీసుకున్నది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన మాజీ కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా తేని సాక్షులను ప్రభావితం చేశారనే ఆరోపణల నేపథ్యంలో నివేదిక సమర్పించాలని యూపీ పోలీసులను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ వ్యవహారంలో దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని లఖింపూర్ ఖేరీ ఎస్పీకి సూచించింది. సాక్షులను బెదిరించారన్న ఆరోపణలపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఆరోపణలను నిందితుడు తరఫు న్యాయవాది సిద్ధార్థ్ దవే తోసిపుచ్చారు.
ఈ విషయం కోర్టు ముందుకు వచ్చిన ప్రతిసారీ సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేసేందుకు ఇలాంటి వాదనలు చేస్తున్నారన్నారు. తన క్లయింట్‌ను అనవసరంగా లక్ష్యం చేసుకుంటున్నారన్నారు. కేసులో ముఖ్యమైన సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినట్లుగా తన వద్ద ఆడియో రికార్డింగ్‌లను ఉన్నాయని ఫిర్యాదుదారుల తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పష్టం చేశారు. బెయిల్ షరతులను ఉల్లంఘించి ఆశిష్ మిశ్రా బహిరంగ సభలో పాల్గొన్నారన్నారు. వెంటనే ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. సమాచారాన్ని యూపీ స్టాండింగ్ కౌన్సిల్‌కు అప్పగించాలని న్యాయవాదులను ధర్మాసనం ఆదేశించింది.
దాంతో లఖింపూర్ ఎస్పీకి విచారణ చేసేందుకు కేసును అప్పగించవచ్చని తెలిపింది. విచారణను నాలుగు వారాల తర్వాత జరుపనున్నట్లు పేర్కొంది. యూపీలోని లఖింపూర్‌లో 2021 అక్టోబర్ 3న జరిగిన హింసలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్ మంత్రి లఖింపూర్ పర్యటనకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఆ సమయంలో నలుగురు రైతులు కారు ఢీకొని ప్రాణాలు కోల్పోయారు. హింసలో ఓ జర్నలిస్ట్ సైతం మృతి చెందాడు. ఈ కేసులో ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ ఘటన తర్వాత ఆగ్రహం రైతులు కారు డ్రైవర్‌తో పాటు ఇద్దరు బీజేపీ కార్యకర్తలను కొట్టిచంపారు. అప్పట్లో ఈ సంఘటన యావత్ దేశవ్యాప్తంగా సంచలనమైంది.