న్యూఢిల్లీ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రకటించిన నూతన నిబంధనల అమలును సుప్రీంకోర్టు గురువారం నిలిపివేసింది. ఈ నిబంధనలను పునఃపరిశీలించాలని తెలిపింది. అస్పష్టంగా ఉన్న ఈ నిబంధనలు దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నది. జనరల్ క్యాటగిరీ విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.
తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేసింది. యూజీసీ రెగ్యులేషన్స్, 2026ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్ మాట్లాడుతూ, స్వాతంత్య్రానంతరం 75 ఏండ్లు గడిచినప్పటికీ, మన సమాజం కుల ఆధారిత వివక్షను పారదోలలేకపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్గ రహిత సమాజంగా మారవలసి ఉండగా, తిరోగమన సమాజంగా మారుతున్నామా? అని ప్రశ్నించారు.
ర్యాగింగ్‌లో అత్యంత దయనీయ పరిస్థితులు ఉన్నాయని, దక్షిణాది లేదా ఈశాన్య రాష్ర్టాల నుంచి వచ్చే విద్యార్థులు తమ సంస్కృతిని తమతోపాటు తీసుకొస్తారని, ఆ సంస్కృతి గురించి తెలియని వారు వారిపై వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ప్రత్యేక హాస్టల్స్‌ను ఏర్పాటు చేయాలని మీరు కోరుతున్నారన్నారు. కులాంతర వివాహాలు జరుగుతున్నాయని, అందరూ కలిసి ఉండే హాస్టల్స్‌లో ఉంటున్నామని గుర్తు చేశారు.
యూజీసీ నిబంధనల్లోని పదజాలాన్ని నిపుణుడు సమీక్షించాలని సుప్రీంకోర్టు చెప్పింది. యూజీసీకి, కేంద్ర ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ, అమెరికాలో నల్లజాతివారు, తెల్లజాతివారు వేర్వేరు పాఠశాలల్లో చదువుతారని, అటువంటి పరిస్థితి మన దేశంలో రాకూడదని ఆశిస్తున్నానని చెప్పారు.