న్యూఢిల్లీ: అన్నూ కపూర్ తీసిన హమారే బారాహ్(Hamare Baarah) చిత్రం రిలీజ్‌పై ఇవాళ సుప్రీంకోర్టు స్టే జారీ చేసింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని శుక్రవారం రిలీజ్ చేయాల్సి ఉన్నది. ఇస్లామిక్ విశ్వాసాలకు, ముస్లిం మహిళల వివాహం గురించి ఆ చిత్రంలో అవమానకర రీతిలో డైలాగ్‌లు ఉన్నట్లు గుర్తించామని కోర్టు పేర్కొన్నది. జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో విచారణ చేపట్టింది. అజర్ బాషా తంబోలీ అనే వ్యక్తి పిటీషన్ వేయగా, ఫౌజియా షకీల్ అనే న్యాయవాది కోర్టులో ఆ పిటీషన్‌పై వాదించారు. చిత్రం రిలీజ్ స్టే పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ముంబై హైకోర్టును కోరారు.
హమారే బారాహ్ చిత్రానికి చెందిన ట్రైలర్‌ను చూశామని, ఆ ట్రైలర్లో అభ్యంతరకర డైలాగ్‌లు ఉన్నట్లు గుర్తించామని ధర్మాసనం తెలిపింది.అందుకే ఫిల్మ్ రిలీజ్‌పై స్టే ఇస్తున్నామని కోర్టు చెప్పింది. రిలీజ్‌కు చెందిన పిటీషన్‌పై బాంబే హైకోర్టు నిర్ణయం తీసుకునే వరకు స్టే అమలులో ఉండనున్నట్లు సుప్రీం తెలిపింది. ఈ చిత్రాన్ని ఇప్పటికే కర్నాటకలో బ్యాన్ చేశారు. జూన్ 14వ తేదీన ఇది థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉన్నది.