న్యూఢిల్లీ: కాలేజీ క్యాంపస్లో విద్యార్థినులు హిజాబ్, బురఖా, టోపీ, నఖాబ్ వంటి వాటిని ధరించడంపై నిషేధం విధిస్తూ ముంబైలోని ఓ కళాశాల ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. విద్యాసంస్థలు నిబంధనలను వాటి ఇష్టానుసారం విద్యార్థులపై బలవంతం చేయకూడదని, ఏ దుస్తులు ధరించాలనే విషయంలో విద్యార్థినులకు పూర్తి స్వేచ్ఛ ఉండాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజీవ్ కుమార్ ధర్మాసనం స్పష్టం చేసింది. విద్యార్థుల మతపరమైన విశ్వాసాలు బయటకు తెలియకుండా ఉండాలని భావిస్తే నుదుటన బొట్టు లేదా తిలకం పెట్టుకోవడంపై ఎందుకు నిషేధం విధించలేదని ప్రశ్నించింది. అయితే తరగతి గదిలో విద్యార్థినులు బురఖా ధరించడాన్ని అనుమతించకూడదని స్పష్టం చేసింది.