న్యూఢిల్లీ: తక్షణమే పూణె లోక్సభకు ఉప ఎన్నిక(Pune Lok Sabha Bypoll) నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని ఇటీవల బాంబే హైకోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాలపై ఇవాళ సుప్రీంకోర్టే స్టే విధించింది. ఎంపీ గిరీశ్ బాపత్ మృతితో గత ఏడాది మార్చి 29వ తేదీ నుంచి పూణె లోక్సభ స్థానం ఖాళీగా ఉన్నది. అయితే ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఇవాళ ఆ కేసులో వాదనలు విన్నది. అయితే ఈ ఏడాది జూన్ 16వ తేదీన ప్రస్తుత లోక్సభ పదవీకాలం ముగిస్తుందని, ఈలోపు పూణె స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించడం అవసరం లేదని ఎన్నికల సంఘం తన వాదనల్లో పేర్కొన్నది. ఉప ఎన్నిక విషయంలో సుప్రీం స్టే ఇచ్చినా.. ఎందుకు ఆ ఎన్నిక నిర్వహించడంలో జాప్యం జరిగిందని ఎన్నికల సంఘాన్ని కోర్టు ప్రశ్నించింది.