న్యూఢిల్లీ: పంజాబ్, హర్యానా ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు(Supreme Court) ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసింది. పంట వ్యర్ధాల దహనం కేసులో .. ఆ రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు సమన్లు జారీ చేసింది. వ్యక్తిగతంగా హాజరై, అక్టోబర్ 23వ తేదీన పరిస్థితిని వివరించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, అసానుద్దీన్ అమానుల్లా, ఆగస్టిన్ జార్జ్ మాషిస్లతో కూడిన ధర్మాసనం ఇవాళ ఆ కేసులో ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీలో వాయు కాలుష్యం కేసులో విచారణ చేపడుతున్న ధర్మాసనం.. రెండు రాష్ట్రాలకు కార్యదర్శలకు వారం రోజుల గడవు ఇస్తున్నట్లు పేర్కొన్నది.
పంజాబ్, హర్యానా ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోలేకపోతున్న కమీషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్పై కూడా సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. పంట వ్యర్ధాల కాల్చివేతను నియంత్రించేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారని సీఏక్యూఎంను సుప్రీం అడిగింది. ఇదేమీ రాజకీయ అంశం కాదు అని కోర్టు చెప్పింది. చీఫ్ సెక్రటరీ ఎందుకు నిర్లిప్తంగా ఉన్నారని, వాళ్లకు సమన్లు జారీ చేస్తామని, వచ్చే బుధవారం భౌతికంగా కోర్టు ముందు హాజరుకావాలని, హర్యానాలో ఇప్పటి వరకు ఏమీ జరగలేదని, పంజాబ్ ప్రభుత్వం కూడా ఇదే తరహా వ్యవహరిస్తోందని, చీఫ్ సెక్రటరీల ప్రవర్తన ఆమోదయోగ్యంలేదని, గడిచిన మూడేళ్లలో ఒక్కరిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోలేదని కోర్టు తెలిపింది.