Supreme Court | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: విదేశీయులుగా ప్రకటించిన వారి విషయంలో అస్సాం ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిది. విదేశీయులుగా గుర్తించిన వారిని ఎందుకు పంపడం లేదు.. ఏదన్నా మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారా? అని ప్రశ్నించింది. ఎన్ఆర్సీ సందర్భంగా గుర్తించిన 63 మంది విదేశీయులను ఇంకా నిర్బంధ కేంద్రాలలో ఎందుకు నిరవధికంగా ఉంచారని అడుగుతూ.. వారిని రెండు వారాల్లోగా వారి దేశాలకు పంపించి, దానిపై నివేదిక సమర్పించాలని మంగళవారం ఆదేశించింది. వారి చిరునామాలు లభ్యం కాలేదని, అందుకే వారిని పంపలేకపోతున్నామంటూ అస్సాం ప్రభుత్వం ఇచ్చిన వివరణ పట్ల న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.
‘వారిని దేశ బహిష్కారం చేయకుండా మీరు ఇంకా మీనమీషాలు లెక్కపెడుతున్నారు. వారి చిరునామాలు లేకపోతే మనకెందుకు ఆందోళన, వారి దేశాల రాజధానులకు పంపేయండి. వారిని పంపడానికి శుభ ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారా?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. రాజ్యాంగం 21 ప్రకారం వారిని శాశ్వతంగా నిర్బంధ కేంద్రాల్లో ఉంచలేమని పేర్కొంది.
అస్సాంలో చాలా నిర్బంధ కేంద్రాలు ఉన్నాయని, ఇంతవరకు ఎంతమందిని దేశ బహిష్కారం చేశారని ధర్మాసనం ప్రశ్నించింది. ఇది రాష్ర్టానిది కాదు.. కేంద్రానికి సంబంధించిన విషయమని, సమస్యను కేంద్రం దౌత్యమార్గంలో పరిష్కరించాలని, సంబంధిత వ్యక్తులతో దీనిపై చర్చిస్తానని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. జాతీయత తెలియని వారి విషయంలో ఎలాంటి వైఖరి అనుసరించాలనుకుంటున్నారు తదితర వివరాలతో కేంద్రం నివేదిక సమర్పించాలని ఆదేశించిన న్యాయస్థాన ం.. కేసును 25కు వాయిదా వేసింది.