న్యూఢిల్లీ, మే 15: భారతీయ మహిళా సైనికాధికారి కర్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ మంత్రి విజయ్ షాను సుప్రీంకోర్టు గురువారం తీవ్రంగా మందలించింది. మంత్రి వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావని, సున్నితత్వం లోపించిందని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) బీఆర్ గవాయ్ మండిపడ్డారు. రాజ్యాంగపరమైన పదవుల్లో ఉన్న వారు తమ మాటల్లో సంయమనం పాటించాలని హితవు చెప్పారు.
‘ఎటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? కొంచెమన్నా సున్నితత్వం ఉండాలి. ముందు వెళ్లి హైకోర్టుకు క్షమాపణ చెప్పండి’ అంటూ గవాయ్ ఆదేశించారు. కర్నల్ సోఫియా ఖురేషీపై మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ప్రతిపక్షంతోపాటు మాజీ సైనికాధికారులుసైతం ఖండించారు. విజయ్ షాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మధ్యప్రదేశ్ హైకోర్టు బుధవారం పోలీసులను ఆదేశించడంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గురువారం ఈ పిటిషన్ విచారణకు రాగా అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ ఇవ్వడానికి సీజేఐ గవాయ్ నిరాకరించారు.