న్యూఢిల్లీ, మే 30: సోషల్ మీడియా ద్వారా ఎవరూ న్యాయాధికారులను కించపర్చకూడదని సుప్రీంకోర్టు పేర్కొన్నది. మధ్యప్రదేశ్లోని ఓ ఆలయ వివాదంలో తనకు వ్యతిరేకంగా ఉత్తర్వులు ఇచ్చిన జిల్లా అదనపు జడ్జి అవినీతిపరుడంటూ రఘువంశీ అనే వ్యక్తి వాట్సాప్లో ప్రచారం చేశాడు. ఈ అంశాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు సుమోటోగా తీసుకొని అతడికి 10 రోజుల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్ను కొట్టేసింది.
కేవలం అనుకూల తీర్పు రాలేదని న్యాయాధికారిని కించపర్చడంలో అర్థం లేదని వ్యాఖ్యానించింది. న్యాయవ్యవస్థకు కేవలం కార్యనిర్వాహక వ్యవస్థ నుంచే కాకుండా బయటి శక్తుల నుంచి కూడా స్వాతంత్య్రం ఉన్నదని పేర్కొన్నది. న్యాయాధికారిపై ఆరోపణలు చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి ఉండవలసిందని వ్యాఖ్యానించింది.