న్యూఢిల్లీ, జూలై 14: విడాకుల కేసుల్లో జీవిత భాగస్వామికి తెలియకుండా రహస్యంగా రికార్డు చేసిన ఫోన్ సంభాషణలు సాక్ష్యంగా చెల్లుబాటు అవుతాయంటూ సుప్రీంకోర్టు సోమవారం సంచలన తీర్పు ఇచ్చింది. భార్యకు తెలియకుండా ఆమె ఫోన్ సంభాషణలను రహస్యంగా రికార్డు చేయడం భార్య వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమేనంటూ పంజాబ్, హర్యానా హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కనపెట్టింది. వైవాహిక వివాదాలలో భార్యాభర్తల మధ్య టెలిఫోన్ సంభాషణలను సాక్ష్యంగా ప్రవేశపెట్టవచ్చని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. అటువంటి సాక్ష్యం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, 1872లోని సెక్షన్ 122 ఉల్లంఘనగా కాని కుటుంబ సామరస్యాన్ని దెబ్బతీయడంగా కాని పరిగణించలేమని ధర్మాసనం పేర్కొంది.
భార్యాభర్తలు పరస్పరం ఒకరిపై ఒకరు గూఢచర్యానికి పాల్పడుతున్నారంటే వారి మధ్య వైవాహిక బంధంలో పరస్పర విశ్వాసం లోపించినట్లేనని కూడా ధర్మాసనం అభిప్రాయపడింది. గతంలో పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్ఎల్పీ)పై సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. తన భార్య తనపట్ల క్రూరంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ విడాకులు కోరుతూ ఓ భర్త తన భార్యకు సంబంధించి రికార్డు చేసిన ఫోన్ సంభాషణలను సాక్ష్యంగా సమర్పించేందుకు బటిండలోని ఫ్యామిలీ కోర్టు గతంలో అనుమతించింది. తనకు తెలియకుండా రికార్డు చేసిన ఫోన్ సంభాషణలను సాక్ష్యంగా ప్రవేశపెట్టడానికి అనుమతించడం తన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని పేర్కొంటూ సదరు భార్య హైకోర్టులో సవాలు చేశారు. ఆమె వాదనను హైకోర్టు సమర్థిస్తూ ఉత్తర్వులు జారీచేయగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ తీర్పును పక్కనపెట్టింది.