న్యూఢిల్లీ/లక్నో, డిసెంబర్ 10: విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో న్యాయ నైతికతను ఉల్లంఘించి జడ్జి శేఖర్ కుమార్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ వచ్చిన ఆరోపణలపై నివేదిక పంపాలని అలహాబాద్ హైకోర్టుకు సుప్రీం కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. విద్వేషపూరిత ప్రసంగం చేసిన జడ్జిపై అభిశంసన తీర్మానం పెట్టాలని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ డిమాండ్ చేశారు.
డిసెంబర్ 8న వీహెచ్పీ యూపీలోని ప్రయాగ్రాజ్లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో జడ్జి శేఖర్ కుమార్ మాట్లాడారు. సామాజిక సామరస్యం, లౌకిక వాదం, లింగ సమానతను ప్రోత్సహించడమే యూనిఫామ్ సివిల్ కోడ్ (ఉమ్మడి పౌరస్మృతి) ప్రధాన ధ్యేయమని అన్నారు. అయితే ఒక రోజు అనంతరం రెచ్చగొట్టే అంశాలపై జడ్జి చేసిన ప్రసంగాలు వైరల్ కావడంతో విపక్షాలు సహా పలు వర్గాల నుంచి వ్యతిరేకత రావడమే కాక విద్వేషపూరిత ప్రసంగం చేసిన జడ్జిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.