Supreme Court | హైదరాబాద్, జనవరి 3 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ఆస్తిహక్కు.. రాజ్యాంగబద్ధమేనని, అది పౌరులకు కల్పించిన మానవ హక్కుల్లో భాగమేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. భూ పరిహారాన్ని చెల్లించడంలో ప్రభుత్వాలు చేసే జాప్యంతో భూమిచ్చిన రైతులు, ఇండ్లను కోల్పోయిన యజమానులు ఎందుకు నష్టపోవాలని ప్రశ్నించింది. భూ పరిహారం ఎప్పుడైతే చెల్లిస్తారో అప్పటి మార్కెట్ రేటునే అనుసరించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం కీలక తీర్పు వెలువరించింది.
కర్ణాటకలో బెంగళూరు-మైసూరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ (బీఎంఐసీ) ప్రాజెక్టును అప్పటి ప్రభుత్వం తలపెట్టింది. దీనికోసం 2003లో కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్మెంట్ బోర్డు (కేఐఏడీబీ) భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. 2005లో 20 వేలకు పైగా ఎకరాలను సేకరించింది. అయితే భూములిచ్చిన రైతులకు, ఇండ్లను కోల్పోయిన యజమానులకు పరిహారం ఇవ్వడంలో జాప్యం చేసింది. దీంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు.
బాధితులకు పరిహారం ఇవ్వాల్సిందేనని స్పెషల్ ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ (ఎస్ఎల్ఏవో)కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ, పరిహారం చెల్లింపుల్లో ముందడుగు పడలేదు. దీంతో కోర్టు ధిక్కరణ నోటీసులు అందుకోవడంతో ఎట్టకేలకు 2019 ఏప్రిల్లో పరిహారం ఇవ్వడానికి ఎస్ఎల్ఏవో సిద్ధమయ్యారు. అయితే, భూ సేకరణకు నోటిఫికేషన్ జారీచేసిన 2003లో ఉన్న మార్కెట్ రేటు ప్రకారమే పరిహారం ఇస్తామని మెలిక పెట్టారు. దీంతో భూమిని కోల్పోయిన రైతులు, యజమానులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.