న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: న్యాయ విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ), రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు చట్టబద్ధమైన అధికారం లేదని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. న్యాయ విద్యార్థులు న్యాయవాదులుగా నమోదు చేసుకున్న తర్వాత మాత్రమే బార్ కౌన్సిళ్లకు వారిపై క్రమశిక్షణా నియంత్రణ లభిస్తుందని కోర్టు తెలిపింది. విద్యార్థులపై క్రమశిక్షణా అధికారి వారి మాతృ సంస్థకు లేదా అటువంటి సంస్థను నియంత్రించే నిబంధనలు లేదా ఉప నిబంధనల ప్రకారం నిర్దేశించిన అధికార సంస్థకు మాత్రమే ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
ఈ చట్టపరమైన స్థితిని అనుసరించి హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాకు చెందిన 2026 గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్ నమోదును నిషేధించడానికి, సీజేఐకి వ్యతిరేకంగా ప్రచారం చేసినందుకు విద్యార్థులు, అధ్యాపకులపై విచారణ కోరడానికి బీసీఐ చైర్మన్ జారీచేసిన ఆదేశాలు(తర్వాత బీసీఐ స్వయంగా ఉపసంహరించుకున్నది) చట్టవిరుద్ధమైనవని కోర్టు ప్రకటించింది. ఆగస్టు 13న బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ శుక్లా జారీచేసిన ఆదేశాలను సవాలు చేస్తూ నల్సార్ పూర్వ విద్యార్థులు మిహిరా సూద్, అభిషేక్ తివారీ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ వీ మోహనలతో కూడిన ధర్మాసనం విచారించింది.
ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో బీసీఐ చైర్మన్ ఆ ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకున్నారు. ఆగస్టు 14న రిట్ పిటిషన్ను విచారిస్తున్న సమయంలో బీసీఐ చైర్మన్ వ్యవహరించిన తీరుపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. అలాగే బీసీఐ లేదా ఏదైనా రాష్ట్ర బార్ కౌన్సిల్ తీసుకున్న ఏవైనా క్రమశిక్షణా చర్యల నుంచి నల్సార్ విద్యార్థులు, అధ్యాపకులకు రక్షణ కల్పిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వును జారీచేసింది. గురువారం ఈ ఉత్తర్వును ఖరారుచేస్తూ పిటిషన్పై తుది తీర్పు వెలువరించింది.