న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ అధికార నివాసంలో మార్చి 14న హోలీ రోజున జరిగిన అగ్నిప్రమాదంలో డబ్బుల మూటలు కాలినట్లు ఆరోపణలు వచ్చాయి. (Burnt Cash At Justice House) స్టోర్ రూమ్‌లో కాలిన డబ్బుకు సంబంధించిన ఫొటోలు, వీడియో క్లిప్‌ను శనివారం రాత్రి సుప్రీంకోర్టు విడుదల చేసింది. వీటితో పాటు సంబంధిత నివేదికను కూడా సుప్రీంకోర్టు వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ఆధ్వర్యంలో ఈ సంఘటనపై అంతర్గత దర్యాప్తు జరుగుతున్నది. ఈ వివాదం నేపథ్యంలో జస్టిస్ యశ్వంత్ వర్మకు న్యాయపరమైన విధులు అప్పగించవద్దని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్యాయను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు.
కాగా, కాలిన డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ స్పష్టం చేశారు. తనను కించపరిచేందుకు ఉద్దేశపూర్వకంగా జరిగిన కుట్రగా ఆయన ఆరోపించారు. కాలిన నగదు ఫొటోలు, వీడియో క్లిప్ ప్రామాణికతను ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం తనకు కేటాయించిన నివాసంలోని స్టాఫ్ క్వార్టర్స్‌కు సమీపంలో ఉన్న స్టోర్ రూమ్‌లో మంటలు చెలరేగాయని అన్నారు. పాత ఫర్నీచర్, గృహోపకరణాలు, తోట పనికి వినియోగించే వస్తువులు ఉంచే స్టోర్ రూమ్ అని తెలిపారు. తాళం వేయని ఈ స్టోర్ రూమ్‌కు తన నివాసానికి నేరుగా అనుసంధానం లేదని చెప్పారు.
మరోవైపు తాను, తన భార్య మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు వెళ్లినప్పడు ఆ రోజు రాత్రి వేళ ఆ స్టోర్ రూమ్‌లో అగ్నిప్రమాదం జరిగిందని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ తెలిపారు. తన కుమార్తె, వృద్ధురాలైన తల్లి ఆ సమయంలో ఇంట్లో ఉన్నట్లు చెప్పారు. ఆ స్టోర్ రూమ్‌లో మంటలు చెలరేగడంతో తన కుమార్తె, ప్రైవేట్ సెక్రటరీ అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. మంటలను ఆర్పినప్పుడు తన కుటుంబ సభ్యులు, సిబ్బంది దూరంగా ఉన్నారని చెప్పారు. ఆ సమయంలో అక్కడ ఎలాంటి నగదు కనిపించలేదని అన్నారు.
కాగా, తాను గానీ, తన కుటుంబ సభ్యులు గానీ ఎప్పుడూ ఆ స్టోర్ రూమ్‌లో డబ్బులను నిల్వ చేయలేదని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ తెలిపారు. అలాగే కాలిన కరెన్సీ అవశేషాలు ఏవీ ఫైర్ సిబ్బంది తమకు చూపించలేదని చెప్పారు. ఒకవేళ అంత పెద్ద నగదును నిజంగా రికవరీ చేసి ఉంటే దాని గురించి తమకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. తమ నివాసం నుంచి వేరుగా ఉన్న స్టోర్‌రూమ్‌లో డబ్బుల మూటలు కాలినట్లుగా వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవి, అశాస్త్రీయమైనవి అని ఆయన ఖండించారు.
#WATCH | The Supreme Court released the inquiry report filed by Delhi High Court Chief Justice Devendra Kumar Upadhyaya into the controversy relating to High Court Justice Yashwant Varma. In his report, the Delhi High Court Chief Justice said that he is of the prima facie opinion… pic.twitter.com/1xgMh8xWNW
— ANI (@ANI) March 22, 2025