Supreme Court : లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ (Rahul Gandhi) .. ‘ఓట్ చోర్- గద్దీ ఛోడ్’ అనే నినాదంతో ‘ఓటర్ అధికార్ యాత్ర (Voter Adhikar Yatra)’ నిర్వహించారు. ఈ యాత్రలో ఆయన బీజేపీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఓట్ల చోరీకి పాల్పడుతున్నదని పలుమార్లు ఆరోపించారు.
ఈ క్రమంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సిట్ విచారణ కోరుతూ దాఖలైన పిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాలా బాగ్చిలతో కూడిన ధర్మాసనం పిల్‌ను విచారణకు స్వీకరిచేందుకు నిరాకరించింది. ఈ అంశంపై ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది. తాను ఫిర్యాదు చేసినప్పటికీ ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని పిటిషనర్ తెలియజేయగా.. రాజకీయ అంశాలకు కోర్టులను వేదిక చేసుకోవద్దని, ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలని చెప్పింది.
కాగా బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి దేశంలో ఓట్ల చోరీకి పాల్పడుతున్నాయని రాహుల్‌గాంధీ మండిపడ్డారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం దొంగిలించిన ఓట్లతో ఏర్పడిందని విమర్శించారు. ప్రధానమంత్రి కూడా ఓట్ల తస్కరణకు పాల్పడ్డారని ఆరోపించారు. కొందరు పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కలిగించడం కోసం ప్రజల ఓటు హక్కును దొంగిలించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శలు చేశారు.
త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదేవిధంగా ఓట్లు దొంగలించడానికి కుట్ర పన్నుతున్నారన్నారని ఆరోపించారు. మహారాష్ట్రతోపాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఓట్ల చోరీ చేయడంలో ఎన్డీయే ప్రభుత్వం విజయవంతమైందని విమర్శించారు. బీహార్‌లో మాత్రం ఒక్క ఓటు కూడా చోరీ చేయనివ్వబోమని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సిట్ విచారణ కోసం పిల్ వేయగా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.