న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో భాగంగా యోగా గురువు రాందేవ్ బాబా, పతంజలి ఆయుర్వేద సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ మంగళవారం సుప్రీం కోర్టు ఎదుట హాజరయ్యారు. తమ ఆదేశాలను పాటించకపోవడంపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అన్ని హద్దులూ మీరారని, ఇందుకు తాము తీసుకోబోయే చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. దీంతో పాటు గత నెలలో క్షమాపణలు చెబుతూ పతంజలి సంస్థ దాఖలు చేసిన అఫిడవిట్‌పై కూడా సుప్రీం స్పందించింది. వారి క్షమాపణలతో తృప్తి చెందలేమని వ్యాఖ్యానించింది. దీంతో రాందేవ్‌బాబా కోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. కానీ అఫిడవిట్లో రాందేవ్బాబు, బాలకృష్ణ ఇచ్చిన వివరణపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఏప్రిల్ 10న మరోసారి న్యాయస్థానం ముందు వ్యక్తిగతంగా హాజరవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఆధునిక వైద్య విధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పతంజలి ఆయుర్వేద సంస్థపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. దీన్ని విచారించిన న్యాయస్థానం గతేడాది నవంబర్‌లో పతంజలి సంస్థను మందలించింది. తమ ఉత్పత్తులు ఎన్నో రకాల వ్యాధులను నయం చేస్తాయంటూ తప్పుడు ప్రకటనలివ్వొద్దని స్పష్టం చేసింది. లేదంటే తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని కోర్టు హెచ్చరించింది. భవిష్యత్తులో ఎలాంటి ఉల్లంఘనలు జరగవంటూ అప్పట్లో పతంజలి సంస్థ తరుఫు న్యాయవాది కోర్టుకు విన్నవించుకున్నారు. కానీ ఆ హామీని సంస్థ నిలబెట్టుకోలేకపోయింది. దీనిపై కోర్టు సీరియస్ అయ్యింది. మీపై ఎందుకు చర్యలు తీసుకోరాదంటూ రాందేవ్‌బాబా, బాలకృష్ణలకు నోటీసులు జారీ చేసింది. అలాగే ప్రకటనల విషయంలో కూడా పలు సూచనలు చేసింది. ఇతర వైద్య విధానాలపై ప్రభావం చూపేలా ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియాల్లో ఎలాంటి ప్రచారం చేయరాదని తేల్చి చెప్పింది. అయినప్పటికీ పతంజలి సంస్థ స్పందించలేదు. అదే విషయాన్ని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. తర్వాతి విచారణకు వారిద్దరూ కోర్టుకు రావాలని ఆదేశించింది. ఇందులో భాగంగా ఇటీవల పతంజలి సంస్థ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. న్యాయవ్యవస్థ పట్ల గౌరవమున్నదని పేర్కొంటూ క్షమాపణలు తెలియచేసింది.