న్యూఢిల్లీ : దేశ రాజధానిలో వాయు కాలుష్యం ఇక్కట్లకు గురి చేస్తున్నది. దీపావళి తర్వాత కాలుష్యం తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో ఢిల్లీలో తీవ్ర కాలుష్యంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలవగా.. దీనిపై గురువారం విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. అత్యవసర విచారణకు నిరాకరించింది. ఎన్సీఆర్ పరిధిలో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, వరి పొట్టు తగులబెట్టడాన్ని పూర్తిగా నిషేధించేలా ప్రభుత్వాలను ఆదేశించాలని పిటిషనర్ కోర్టును కోరారు.
పొరుగు రాష్ట్రాల్లో వరి పొట్టు దహనం చేస్తుండడంతో దేశ రాజధానిని పొగ కమ్మేస్తుందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సీఐజే జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమాకోహ్లి, జస్టిస్ జేబీ పార్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ.. ఈ అంశం కేవలం న్యాయవ్యవస్థ పరిధిలోకి రాదని పేర్కొంది.
పంజాబ్, యూపీలోని ప్రతి రైతుపై ఆంక్షలు విధించవచ్చా? నిషేధం ఇందుకు సహాయపడుతుందా? అని కోర్టు పిటిషనర్‌ను ప్రశ్నించింది. కొన్ని కేసులను పరిశీలించవచ్చని.. కొన్ని కేసులు చేయలేవని.. ఎందుకంటే ఆ కేసులు న్యాయపరంగా బాధ్యత వహించవు అని ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్ తరఫున న్యాయవాది శశాంక్ శేఖర్ ఝా వాదనలు వినిపించారు. అంతకుముందు, ప్రత్యేక బెంచ్ నవంబర్ 10న విచారణను వాయిదా వేసింది. ప్రధాన కార్యదర్శులకు సమన్లు పంపేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు.