న్యూఢిల్లీ: బినామీ ఆస్తి లావాదేవీల నిషేధ చట్టం-1988లో చేసిన సవరణలు రాజ్యాంగవిరుద్ధమని పేర్కొంటూ 2022లో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారం ఉపసంహరించుకుంది. 2016లో ప్రభుత్వం ఈ చట్టానికి సవరణలు చేసింది. ఇందులో చేర్చిన సెక్షన్ 3(2) కింద మూడేండ్ల జైలు శిక్ష విధించివచ్చు. చట్ట సవరణ చేసిన రోజు నుంచి కాకుండా చట్టాన్ని చేసిన 1988 సెప్టెంబర్ 5 నుంచి అమలయ్యేలా ఈ సెక్షన్ ఉంది. దీంతో పాటు బినామీ లావాదేవీగా గుర్తించిన ఆస్తిని జప్తు చేసే అధికారాన్ని కేంద్రానికి అప్పగిస్తూ సెక్షన్ 5ను చేర్చింది. ఈ రెండు సెక్షన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు కాగా, అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ చట్ట సవరణలు రాజ్యాంగ విరుద్ధమని, ఏకపక్షంగా ఉన్నాయని 2022 ఆగస్టు 23న సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ తీర్పును కేంద్ర ప్రభుత్వంతో పాటు ఐటీ(బినామీ నిషేధం) డిప్యూటీ కమిషనర్ సవాల్ చేశారు. ఈ అంశాన్ని శుక్రవారం విచారించిన ధర్మాసనం విచారణకు ప్రత్యేక ధర్మాసనాన్ని నియమించనున్నట్టు తెలిపింది.