న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9 : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 36 రోజులపాటు జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆందోళన విషయంలో విద్యార్థులపై బలవంతపు చర్యలు తీసుకోరాదని గతంలోని ఆదేశాలు జారీచేసినప్పటికీ ఆ నిరసనలో పాల్గొన్న ఓ విద్యార్థికి గ్రేటర్ నోయిడా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఎలా నోటీసు జారీచేయగలరని సుప్రీంకోర్టు బుధవారం ప్రశ్నించింది. ఢిల్లీలో జరిగిన సీజేపీ నిరసనలో పాల్గొన్నందుకు గ్రేటర్ నోయిడాలోని గౌతమ్ బుద్ధ విశ్వవిద్యాలయ విద్యార్థి అక్షత్ త్రిపాఠికి రూ.5 లక్షల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని నోటీసు జారీ చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇతర విద్యార్థులను కూడా నిరసనలో చేరమని ఆ విద్యార్థి ప్రోత్సహించినట్టు ఆరోపించిన ఆ నోటీసును పోలీసులు తర్వాత రద్దు చేశారు. సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఉత్తర్వు జారీచేసిందని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్ అన్నారు. ఒక మెజిస్ట్రేట్ జారీచేయడానికి ఎలా సాహసిస్తారు? ఏ విద్యార్థిపైన బలవంతపు చర్యలు ఉండవని మేము స్పష్టం చేశాము. ఏ మెజిస్ట్రేట్ కూడా ఆ ఉత్తర్వును ధిక్కరించలేరు అని సీజేఐ పేర్కొన్నారు. గ్రేటర్ నోయిడా పాలనా యంత్రాంగం నుంచి వివరణ కోరనున్నట్టు పేర్కొన్న ధర్మాసనం ఆ వాస్తవాలను, నోటీసును రికార్డులో ఉంచాలని న్యాయవాదిని ఆదేశించింది.