న్యూఢిల్లీ: సవతి తల్లికి ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వాలా వద్దా అన్న అంశాన్ని తేల్చనున్నట్లు సుప్రీంకోర్టు(Supreme Court) చెప్పింది. భారతీయ వైమానిక దళంలో ఫ్యామిలీ పెన్షన్ రూల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోనున్నట్లు కోర్టు పేర్కొన్నది. జస్టిస్ సూర్య కాంత్, ఎన్ కోటీశ్వర్ సింగ్తో కూడిన ధర్మాసనం ఓ కేసులో ఇవాళ వాదనలు విన్నది. ఓ సవతి తల్లి ఆరేళ్ల చిన్నారిని పెంచి పెద్ద చేసింది, అయితే వైమానిక దళంలో ఉద్యోగం సంపాదించిన ఆ వ్యక్తి మరణించాడు. కానీ సవతి తల్లి కావడం వల్ల ఆమెకు ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చేందుకు ఐఏఎఫ్ నిరాకరించింది. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. ఆ కేసు వాదనల సమయంలో కోర్టు కొన్ని ప్రశ్నలు వేసింది.
తల్లి అనే పదానికి విశాలమైన అర్థం ఉన్నదని, నేటి రోజుల్లో ప్రపంచం చుట్టూ ఎంతో జరుగుతోందని, కన్నతల్లి ఒక్కరే పిల్లల్ని పెంచడం లేదని కోర్టు అభిప్రాయపడింది. కన్న తల్లి చనిపోయినప్పుడు, సవతి తల్లి పెంచిందని, అలాంటప్పుడు ఆమె తల్లి కాదా అని జస్టిస్ సూర్య కాంత్ అడిగారు. ఈ కేసులో విచారణను ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేశారు. జయశ్రీ అనే మహిళ 2021లో ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్లో కేసు దాఖలు చేసింది. పెంచిన కొడుకు చనిపోవడంతో ఆమె ఫ్యామిలీ పెన్షన్ కోసం ఎదురుచూసింది. కానీ ఐఏఎఫ్ తన రూల్స్ ప్రకారం ఆ తల్లికి పెన్షన్ ఇవ్వలేకపోయింది. దీన్ని ఆమె కోర్టులో సవాల్ చేసింది.