Supreme Court : సీబీఎస్ఈ స్కూళ్లలో త్రిభాషా విధానాన్ని అమలు చేస్తూ గతంలో బోర్డు (కేంద్ర ప్రభుత్వం) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఇప్పటికే సీబీఎస్ఈ స్కూళ్లలో త్రిభాషా విధానం అమలవుతోంది. అయితే, ఈ విధానాన్ని సవాలు చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యవసరంగా త్రిభాషా విధానం అమలు చేయాల్సిన అవసరం లేదని వారు కోర్టుకు తెలిపారు.
దీనిపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు సీబీఎస్సీ బోర్డును, కేంద్రాన్ని ప్రశ్నించింది. త్రిభాషా విధానంపై సమీక్షించాలని సూచించింది. అత్యవసరంగా దీన్ని అమలు చేయాల్సిన అవసరం ఏంటని బోర్డును ప్రశ్నించింది. ఈ అంశంపై పిటిషనర్ అనేక అంశాల్ని లేవనెత్తారు. పిటిషనర్ ప్రకారం.. త్రిభాషా విధానాన్ని అమలు చేసేందుకు అనుగుణంగా అనేక చోట్ల ఇప్పటికీ పుస్తకాలు అందుబాటులో లేవు. భాషా శాస్త్రం బోధించేందుకు తగిన ఉపాధ్యాయులు కూడా లేరు. చాలా పాఠశాలల్లో భాషా బోధన ఇంకా ప్రారంభం కాలేదు. ఒక పక్క పరీక్షలు సమీపిస్తున్నా ఉపాధ్యాయులు, పుస్తకాల కొరత వేధిస్తోంది.
పైగా విద్యార్థులు గతంలో అసలు అలవాటులేని భాషను ఇప్పుడు చదవాల్సి వస్తోంది. ఇది వారి విద్యపై దుష్ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి బదులిచ్చారు. త్రిభాషా విధానాన్ని అమలు చేసేందుకు ముందుగానే తగిన చర్యలు తీసుకున్నామన్నారు. అవసరమైన మెటీరియల్ కూడా అందజేశామని తెలిపారు. దీంతో స్పందించిన కోర్టు ఈ నిర్ణయం అమలు చేయడాన్ని తాము తప్పుబట్టడం లేదని, అయితే, విద్యార్థుల ఆసక్తి, అవసరాల్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది.
ఇదే సమయంలో ఆరో తరగతి విద్యార్థులకు త్రిభాషా విధానాన్ని అమలు చేసే అంశంపై పునఃసమీక్షించాలని సూచించింది. ఇంగ్లీష్ స్థానిక భాష కాదు అని సీబీఎస్ఈ తీసుకున్న నిర్ణయంపై కూడా సమీక్షిస్తామని చెప్పింది. స్థానిక భాష అంశాన్ని పరిశీలిస్తామంది. మరో పది రోజుల్లో ఈ కేసుపై తదుపరి విచారణ జరుపుతామని చెబుతూ కేసును వాయిదా వేసింది.