Waqf Amendment Act | న్యూఢిల్లీ, ఏప్రిల్ 16 : వివాదాస్పద వక్ఫ్ సవరణ చట్టం-2025లోని పలు కీలక నిబంధనలపై స్టే విధింపునకు సుప్రీంకోర్టు బుధవారం ప్రతిపాదించింది. కోర్టులు ‘వక్ఫ్’గా ప్రకటించిన ఆస్తులను డీనోటిఫై చేసే అధికారం, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, బోర్డుల్లో ముస్లిమేతరులకు చోటు కల్పించే నిబంధనలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీచేస్తామని కోర్టు ప్రతిపాదించగా, కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. అటువంటి మధ్యంతర ఆదేశాలు జారీచేసే ముందు తమ వాదనలు వినాలని కోరింది. వక్ఫ్ సవరణ చట్టం 2025ని సవాలు చేస్తూ దాఖలైన 75 పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. హిందూ మత ట్రస్టుల్లో ముస్లింలను కూడా భాగస్వాములుగా చేర్చుకోవడానికి అనుమతిస్తారా అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
వక్ఫ్‌గా న్యాయస్థానాలు ప్రకటించిన ఆస్తులను డీనోటిఫై చేయరాదని, అవి వక్ఫ్బై యూజర్‌గా ఉన్నా వక్ఫ్ బై డీడ్(ఒప్పంద పత్రాలు)గా ఉన్న వాటిని డీనోటిఫై చేయరాదని సుప్రీంకోర్టు పేర్కొంది.‘ఎక్స్ అఫీషియో సభ్యులు మినహాయించి వక్ఫ్ బోర్డులు, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్‌కు చెందిన సభ్యులు అందరూ ముస్లింలు మాత్రమే ఉండాలి’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. తొలుత ఈ పిటిషన్లను హైకోర్టుకు నివేదించాలని భావించిన సుప్రీంకోర్టు నిర్ణయాన్ని మార్చుకుని పిటిషనర్ల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ, రాజీవ్ ధావన్తోసహా పలువురు న్యాయవాదులు, కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలను సుదీర్ఘంగా ఆలకించింది. ప్రస్తుతానికి లాంఛనంగా ఎటువంటి నోటీసు జారీచేయనప్పటికీ ఏప్రిల్ 17న(గురువారం) మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పిటిషన్లపై విచారణను తిరిగి చేపడతామని ధర్మాసనం తెలియచేసింది.
వక్ఫ్ చట్టం ఆమోదం పొందిన తర్వాత దేశంలో జరుగుతున్న హింసాకాండ పట్ల ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. తాము విచారణకు స్వీకరించిన తరుణంలో ఈ హింస జరగడం ఆందోళనకరమని ధర్మాసనం పేర్కొంది. విచారణ సందర్భంగా ఎక్స్ అఫిషియో సభ్యులను మతాలకు అతీతంగా ఎవరినైనా ప్రభుత్వం నియమించుకోవచ్చని, కాని ఇతరులు మాత్రం ముస్లింలు మాత్రమే ఉండాలని ఉత్తర్వులు జారీచేస్తామని సీజేఐ ప్రతిపాదించారు.
వక్ఫ్‌గా చాలా ఆస్తులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు ఉండకపోవచ్చని, అలాంటి పరిస్థితిలో వక్ఫ్ బై యూజర్ని ఎందుకు అనుమతించరని తుషార్ మెహతాను ధర్మాసనం ప్రశ్నించింది. యజమాని వద్ద వక్ఫ్‌కు సంబంధించి లిఖితపూర్వక పత్రాలు ఉండనప్పటికీ వాటి దీర్ఘకాల ఉపయోగాన్ని పరిగణనలోకి తీసుకుని మతపరమైన లేదా చారిటబుల్ ఎండోమెంట్(వక్ఫ్)గా ఆ ఆస్తులను గుర్తించడాన్ని వక్ఫ్ బై యూజర్‌గా వ్యవహరించడం ఆనవాయితీగా వస్తోంది. ‘అటువంటి వక్ఫ్ బై యూజర్‌ను ఎలా రిజిస్టర్ చేస్తారు? వారి వద్ద ఏం డాక్యుమెంట్లు ఉంటాయి? ఇది మరొకందుకు దారితీయవచ్చు. కొంత దుర్వినియోగం జరగవచ్చు. కాని నిజమైనవి కూడా ఉంటాయి.
వక్ఫ్ బై యూజర్‌ను గుర్తించినట్టు బ్రిటిష్ కాలం నాటి తీర్పులను నేను చదివాను. వక్ఫ్ బై యూజర్‌ను తొలగిస్తే అది సమస్యగా మారుతుంది. చట్టసభ ఏ తీర్పును, ఉత్తర్వును లేదా డిక్రీని గాలిలోకి ప్రకటించలేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా, వక్ఫ్ చట్టం తమకు వద్దని చాలా మంది ముస్లింలు కోరుకుంటున్నట్లు తుషార్ మెహతా ధర్మాసనానికి విన్నవించారు. దీనికి ధర్మాసనం స్పందిసూ,్త‘హిందూ ధార్మిక బోర్డులలో భాగస్వాములుగా ముస్లింలను కూడా ఇప్పటి నుంచి అనుమతిస్తున్నామని మీరు చెబుతున్నారా? సూటిగా బయటకు చెప్పండి’ అంటూ మెహతాను ప్రశ్నించింది.
100 లేదా 200 సంవత్సరాల క్రితం వక్ఫ్‌గా ఓ పబ్లిక్ ట్రస్టును ప్రకటిస్తే హఠాత్తుగా దాన్ని వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకుని అది వక్ఫ్ కాదని ప్రకటించలేదని ధర్మాసనం స్పష్టం చేసింది. గతాన్ని మీరు తిరిగిరాయలేరు అంటూ కేంద్రం తరఫున హాజరైన మెహతాకు ధర్మాసనం స్పష్టం చేసింది. సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) 28 సార్లు సమావేశమై 98.2 లక్షల వినతిపత్రాలను పరిశీలించిన తర్వాత ఇచ్చిన నివేదికను ఆధారం చేసుకుని రూపొందించిన వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయని మెహతా తెలిపారు.
విచారణ ప్రారంభంలో సీజేఐ మాట్లాడుతూ ఉభయ పక్షాలను తాను రెండు అంశాలను అడగదలచుకున్నానని చెప్పారు. ఈ పిటిషన్లను తాము స్వీకరించాలా లేక హైకోర్టుకు నివేదించాలా అన్నది మొదటి అంశం కాగా నిజంగా ఈ పిటిషన్లను మేము విచారణకు తీసుకుంటే చిత్తశుద్ధితో వాదించాలని మీరు కోరుకుంటున్నారా అని సీజేఐ ఇరుపక్షాలను ప్రశ్నించారు. పిటిషన్లను విచారణకు స్వీకరించేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని కూడా సీజేఐ స్పష్టం చేశారు.
పిటిషనర్ల తరఫున హాజరైన కపిల్ సిబల్ జవాబిస్తూ వక్ఫ్ సవరణ చట్టాన్ని ప్రస్తావించారు. ముస్లింలు మాత్రమే వక్ఫ్‌ను సృష్టించగలరన్న చట్టంలోని నిబంధనను తాము సవాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. తాను ముస్లింనో కాదో, వక్ఫ్‌ను సృష్టించడానికి తాను అర్హుడినో కాదో రాజ్యం ఎలా నిర్ణయిస్తుందని ఆయన ప్రశ్నించారు. గడచిన ఐదేళ్లుగా ఇస్లాంను పాటిస్తున్న వారు మాత్రమే వక్ఫ్‌ను సృష్టించగలరని ప్రభుత్వం ఎలా అనగలదని కొందరు పిటిషనర్ల తరఫున హాజరైన మరో సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ ప్రశ్నించారు. వక్ఫ్ చట్టం దేశవ్యాప్తంగా ప్రభావం చూపగలదని, ఈ పిటిషన్లను హైకోర్టుకు నివేదించరాదని ఆయన ధర్మాసనాన్ని అభ్యర్థించారు.
మరో సీనియర్ న్యాయవాది హజేఫా అహ్మదీ వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వక్ఫ్ బై యూజర్ అన్నది ఇస్లాంలో ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితీ అని, దాన్ని ఇప్పుడు తొలగించలేరని వాదించారు. పార్లమెంట్ ఉభయ సభలలో తీవ్ర వాగ్వివాదాల తర్వాత ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏప్రిల్ 5న ఆమోదం తెలియచేయడంతో వక్ఫ్ (సవరణ) చట్టం, 2025ని కేంద్రం ఇటీవలే నోటిఫై చేసింది. వక్ఫ్ చట్టాన్ని సవాలు చేస్తూ ఐఏఎంఐఎం నాయకుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, జామియత్ ఉలామా ఇ హింద్, ద్రవిడ మున్నేట్ర కళగం(డీఎంకే), కాంగ్రెస్ ఎంపీలు ఇమ్రాన్ ప్రతాప్‌గఢి, మొహమ్మద్ జావేద్తోసహా వివిధ వ్యక్తులు, సంస్థలు దాదాపు 172 పిటిషన్లను సుప్రీంకోర్టులో దాఖలు చేశాయి. కాగా, ఈ పిటిషన్లపై ఉత్తర్వులు ఏవీ జారీ చేయడానికి ముందు తమ వాదన వినాలని కోరుతూ కేంద్రం ఏప్రిల్ 8న సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది.