Supreme Court | ఎలక్ట్రానిక్ కౌంటింగ్‌లో నమోదైన ఓట్లతో ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (VVPAT)ని వందశాతం లెక్కించేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశంపై ఢిల్లీ హైకోర్టు 2024 ఆగస్టు 12న ఇచ్చిన ఆదేశాలను హన్స్‌రాజ్ జైన్ దాఖలు చేసిన పిటిషన్ విచారించేందుకు చీఫ్ జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. హన్స్‌రాజ్ జైన్ అప్పీల్‌ను తోసిపుచ్చిన సీజే.. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు సరైన కారణం లేదని పేర్కొంది. స్పెషల్ లీవ్ పిటిషన్‌ను కొట్టివేసింది.
సుప్రీంకోర్టు గతంలో ఇలాంటి అంశాలపై తీర్పును ఇచ్చిందని.. మళ్లీ మళ్లీ దాన్ని లేవనెత్తలేమని సీజేఐ పేర్కొన్నారు. వీవీప్యాట్ రికార్డులతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (EVM) డేటాను 100 శాతం క్రాస్ వెరిఫికేషన్ చేయాలంటూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు.. ఈవీఎంలు సురక్షితమైనవని.. సులభమైనవి, యూజర్ ఫ్రెండ్లీ అని తెలిపింది. గతేడాది ఆగస్టు 12న ఢిల్లీ హైకోర్టును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించింది. ఇదిలా ఉండగా గతేడాది లోక్‌సభ ఎన్నికల వేళ సైతం సుప్రీంకోర్టులో ఈవీఎంలో నమోదైన ఓట్లతో వందశాతం వీవీ ప్యాట్ల స్లిప్స్‌ను సరిపోల్చాలని దాఖలైన పిటిషన్లను జస్టిస్ సంజీవ్ కన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించిన విషయం తెలిసిందే.