Supreme Court | ప్రధాన ఎన్నికల కమిషన్, ఎన్నికల కమిషనర్ల నియామక చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను ఫిబ్రవరి 12న విచారిస్తామని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, ఎన్ కోటీశ్వర్ సింగ్తో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని మెరిట్ ఆధారంగా నిర్ణయిస్తుందని బెంచ్ పేర్కొంది. ఏడీఆర్ తరఫున విచారణకు హాజరైన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ.. కేసు విచారణ ఫిబ్రవరి 4న జాబితా అయ్యిందని.. కానీ, ఇతర కేసుల కారణంగా విచారణకు వచ్చే అవకాశం లేదన్నారు.ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) రాజీవ్ కుమార్ ఫిబ్రవరి 18న పదవీ చేయనున్నారు. రాజ్యాంగ ధర్మాసనం 2023 నిర్ణయం కిందకు వస్తుందని.. కాబట్టి ఈ విషయాన్ని అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఉందని ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు.
సీఈసీ, ఈసీల నియామకంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించి.. మరో మంత్రిని నియమించి చట్టం ద్వారా.. కమిషనర్ల నియామకం ప్రభుత్వంపైనే ఆధారపడి ఉండేలా చేశారన్నారు. ఇది సమాన అవకాశానికి, మన ఎన్నికల ప్రజాస్వామ్యానికి విరుద్ధమని రాజ్యాంగ ధర్మాసనం చెప్పిందన్నారు. ఎన్నికల కమిషనర్లను నియమించేందుకు స్వతంత్ర కమిటీ అవసరమన్నారు. వాస్తవానికి 2023 కేంద్ర ప్రభుత్వం సీఈసీ, ఈసీల నియామకానికి కొత్త చట్టం తీసుకువచ్చింది. గతంలో సీఈసీ, ఈసీల నియామకం కోసం ఉద్దేశించిన ప్యానెల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సైతం ఉండగా.. కేంద్రం సీజేఐని తప్పించి కేంద్ర న్యాయశాఖ మంత్రిని ప్యానెల్లోకి తీసుకుంది. ఈ మేరకు పార్లమెంట్లో కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టి.. ఆమోదించింది.