UGC Equity Rules : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇటీవల విడుదల చేసిన కొత్త రూల్స్‌పై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. ‘ఈక్విటీ రెగ్యులేషన్స్’ పేరుతో యూజీసీ ఈ నెల 13న విడుదల చేసిన కొత్త నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా రూల్స్ అమలుపై స్టే విధిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలోని బెంచ్ కేంద్ర ప్రభుత్వంతో పాటు యూజీసీకి నోటీసులు జారీ చేసింది.
తాజా రూల్స్ స్పష్టంగా లేవని, ఇవి సమాజాన్ని విడదీసేలా లేదా సమాజంలో అలజడి సృష్టించే ప్రమాదం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. ‘‘75 ఏళ్ల స్వతంత్ర భారతంలో మనం వర్గాలులేని సమాజాన్ని నిర్మించామా.. లేక సమాజాన్ని మళ్లీ తిరోగమనం వైపు తీసుకెళ్తున్నామా..? తమ సంస్కృతిని పాటిస్తున్న దక్షిణాది వారిపై, ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులపై ఇంకా ర్యాగింగ్ చేస్తున్నాం. వారిపై కామెంట్ చేస్తున్నాం. ఇంకా మీరు ప్రత్యేక హాస్టళ్ల గురించి అడుతున్నారు. అదృష్టవశాత్తు మన దేశంలో కులాంతర వివాహాలు జరుగుతున్నాయి. హాస్టళ్లలో అందరూ కలిసే ఉంటున్నారు. అమెరికాలోలాగా నల్లజాతీయులకు, శ్వేత జాతీయులకు వేర్వేరు పాఠశాలలున్నట్లు.. మనం విభజన కలిగిన పాఠశాలలవైపు వెళ్లడం లేదు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో కొత్త రూల్స్ అమలు నిలిపివేసింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు 2012 నాటి పాత మార్గదర్శకాలే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యూజీసీ న్యూ రూల్స్‌కు వ్యతిరేకంగా జనరల్ కేటగిరి విద్యార్థులు, పౌరులు ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే.
రోహిత్ వేముల, పాయల్ తద్వి వంటి బలహీనవర్గాల విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో.. యూనివర్సిటీ క్యాంపస్‌లలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ,మహిళల రక్షణ కోసం యూజీసీ ‘ఈక్విటీ రెగ్యులేషన్స్ 2026’ పేరుతో కొత్త రూల్స్ తీసుకొచ్చింది. దీనిలో భాగంగా ప్రత్యేక కమిటీలు ఏర్పాటై.. వాటిలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సభ్యులు తప్పనిసరిగా ఉంటారు. అలాగే ఈ నిబంధనలు పాటించని యూనివర్సిటీలు, విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేస్తారు. అయితే, ఈ నిబంధనల వల్ల తమకు అన్యాయం జరుగుతుందని జనరల్ కేటగిరి విద్యార్థులు మండిపడుతున్నారు. దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగుతున్నారు. మరోవైపు ఈ రూల్స్‌ను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన వారు సమర్ధిస్తున్నారు.