న్యూఢిల్లీ: చెక్ బౌన్స్ కేసును ఫిర్యాదుదారు తన బ్యాంకు ఖాతాను నిర్వహిస్తున్న బ్యాంకు శాఖ ఏ న్యాయస్థానం పరిధిలోకి వస్తుందో, అదే న్యాయస్థానంలో మాత్రమే దాఖలు చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. చెక్ బౌన్స్ అయినపుడు నెగోషబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్, 1881లోని సెక్షన్ 138 ప్రకారం కేసును దాఖలు చేయవలసిన న్యాయస్థానం అధికార పరిధి గురించి వివాదం ఉత్పన్నమవుతుండటం సాధారణ విషయం.
చెక్ బౌన్స్ కేసులో ట్రాన్స్ఫర్ పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్‌లు జేబీ పార్దివాలా, ఆర్ మహదేవన్ ధర్మాసనం ఈ సమస్యను పరిష్కరించింది. అకౌంట్ పేయీ చెక్కు బౌన్స్ అయినపుడు సెక్షన్ 138 ప్రకారం దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపే అధికార పరిధి ఆ పేయీ తన ఖాతాను నిర్వహిస్తున్న బ్యాంకు హోం బ్రాంచ్ ఏ కోర్టు అధికార పరిధిలో ఉంటుందో, అదే న్యాయస్థానం విచారణ జరపాలని వివరించింది.