న్యూఢిల్లీ : మతపరమైన ప్రార్థనా స్థలాలను సర్వే చేయాలని కోరుతూ కొత్తగా దాఖలయ్యే పిటిషన్లను స్వీకరించరాదని, ప్రస్తుతం విచారణలో ఉన్న పిటిషన్లపై తాత్కాలిక లేదా తుది ఉత్తర్వులు జారీ చేయరాదని దేశంలోని అన్ని కోర్టులను సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధనల చట్టం, 1991 చెల్లుబాటుపై విచారణ జరిపి, తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు కోర్టులు సంయమనం పాటించాలని తెలిపింది.
సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. దీంతో జ్ఞానవాపి, మథుర, సంభల్ సహా 10 మసీదులు, దర్గాలపై హిందూ పిటిషనర్లు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ నిలిచిపోయింది. వీటి మతపరమైన అసలు స్వభావాన్ని తెలుసుకునేందుకు సర్వే చేయాలని ఈ పిటిషనర్లు కోరుతున్నారు. సీజేఐ నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం 6 పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ ఆదేశాలను ఇచ్చింది. ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధనల చట్టం, 1991 నిబంధనలను సవాల్ చేస్తూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్ కూడా వీటిలో ఉంది.
ఈ పిటిషన్లపై నాలుగు వారాల్లోగా స్పందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధనల చట్టం, 1991 ప్రకారం, మతపరమైన ప్రార్థనా స్థలాలు 1947 ఆగస్టు 15న ఏ విధంగా ఉన్నాయో, అదే పరిస్థితిని కొనసాగించాలి. వాటి మతపరమైన స్వభావాన్ని మార్చకూడదు. ఈ చట్టాన్ని హిందూ సంస్థలు, మరికొందరు పిటిషనర్లు సవాల్ చేశారు. ఈ చట్టం హిందువులు, జైనులు, బౌద్ధులు, సిక్కుల హక్కులను ఉల్లంఘిస్తున్నదని ఆరోపించారు.