న్యూఢిల్లీ : అటవీ భూముల సంరక్షణకు సంబంధించి సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రిజర్వ్ ఫారెస్ట్ భూములను ఎవరైనా ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు కేటాయించారా? వాటిని అటవీ సంరక్షణ కోసం కాకుండా ఇతర అవసరాల కోసం వినియోగిస్తున్నారా తేల్చాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాల ద్వారా వివరాలు సేకరించి, అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకోవాలని తేల్చిచెప్పింది. ఈ ప్రక్రియ ఏడాదిలోగా పూర్తి చేయాలని ఆదేశించింది.
పుణెలోని అటవీ భూమి అన్యాక్రాంతానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని జస్టిస్ అగస్టీన్ జార్జ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సిట్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు స్పష్టం చేసింది. పుణెలో అటవీ భూమిని అక్రమంగా ప్రైవేటు వ్యక్తుల వాణిజ్య అవసరాలకు కేటాయించిన ఉదంతం రాజకీయ నాయకులు, అధికారులు, బిల్డర్ల మధ్య సంబంధం ఎలా ఉందో చెప్పేందుకు పుణె కేసు ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొంది.