న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: గృహ నిర్మాణ హక్కును ప్రాథమిక హక్కుగా ప్రకటించిన సుప్రీం కోర్టు ఒత్తిడిలో ఉన్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల కోసం పునరుద్ధరణ నిధిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే ప్రాథమిక హక్కులో ఆశ్రయం పొందే హక్కు అంతర్భాగం. దీనివలన రాష్ట్రం తన పౌరులకు తగిన గృహాలను పొందేలా చూసుకోవాలి’ అని సుప్రీం కోర్టు శుక్రవారం నొక్కి చెప్పింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు గృహ కొనుగోలుదారులను రక్షించడం, రియల్ ఎస్టేట్ రంగాన్ని ఊహాజనిత పద్ధతుల నుంచి ప్రక్షాళన లక్ష్యంగా అనేక ఆదేశాలను జారీ చేసింది. ఈ రంగంలో కొన్ని అవకతవకల కారణంగా అనేక ప్రాజెక్టులు నిలిచిపోయాయని, అనేక కుటుంబాలు చిక్కుకుపోయాయని పేర్కొంది.
గ్రేటర్ నోయిడాలోని ఒక హౌసింగ్ ప్రాజెక్టుకు సంబంధించి నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ప్రకటించిన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పలువురు దాఖలు చేసిన అప్పీళ్లపై విచారించిన జస్టిస్ జేబీ పార్ధివాలా, ఆర్ మహదేవన్ ధర్మాసనం.. ఇల్లు అన్నది కేవలం ఒకరి తలపై కప్పు కాదు.. అది ఆశలు, కలల ప్రతిబింబం అని వ్యాఖ్యానించింది. పన్ను చెల్లించే మధ్య తరగతి పౌరుడు ఇంటి కోసం తన జీవితాంతం పొదుపు చేసిన డబ్బును పెట్టుబడి పెట్టి రెట్టింపు భారాన్ని మోస్తున్నాడని తెలిపింది. ఒక వైపు ఈఎంఐ చెల్లిస్తున్నా కలల ఇల్లు అసంపూర్ణ భవనంగా మిగిలిపోతున్నదన్నారు. ఇల్లు లేకపోవడం వల్ల కలిగే ఆందోళన ఆరోగ్యం, ఉత్పాదకత, గౌరవంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని సుప్రీంకోర్టు విచారం వ్యక్తం చేసింది.
‘గృహ నిర్మాణం విలాసవంతమైనది కాదు, ఊహాజనిత సాధనం కాదు. కానీ ఒక ప్రాథమిక అవసరం’ అని పేర్కొన్న సుప్రీం బెంచ్ 12 విస్తృత ఆదేశాలను జారీ చేసింది. ఇందులో ఎన్సీఎల్టీ, ఎన్సీఎల్ఏటీ వంటి వాటిలో యుద్ధ ప్రాతిపదికన ఖాళీలను భర్తీ చేయడం, ట్రైబ్యునళ్లను బలోపేతం చేయడం, రియల్ ఎస్టేట్ దివాలా తీయడాన్ని పరిష్కరించడానికి అదనపు బెంచ్‌లను ఏర్పాటు చేయడం వంటివి ఉన్నాయి. మురికి నీటి ప్రవాహం వంటి ఘటనల కారణంగా ఢిల్లీలోని ఎన్సీఎల్టీ కోర్టు గదులను మూసివేసిన క్రమంలో ట్రైబ్యునళ్ల మౌలిక సదుపాయాల ఉన్నతీకరణపై మూడు నెలల్లోగా నివేదికలు దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించారు. తీర్పుకు సంబంధించిన కాపీని క్యాబినెట్ కార్యదర్శి, అన్ని రాష్ర్టాల చీఫ్ సెక్రటరీలకు పంపాలని రిజిస్ట్రీని ఆదేశించింది.