న్యూఢిల్లీ, జనవరి 2: హర్యానా-పంజాబ్ సరిహద్దు ఖనౌరిలో రైతు నేత డల్లేవాల్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షపై పంజాబ్ ప్రభుత్వాన్ని గురువారం సుప్రీం కోర్టు తీవ్రంగా విమర్శించింది. డల్లేవాల్ దీక్షను భగ్నం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కొందరు ప్రభుత్వ అధికారులు, రైతు నేతలు మీడియాలో తప్పుడు అభిప్రాయాన్ని సృష్టించారని పేర్కొంది.
డల్లేవాల్ దీక్షను భగ్నం చేయమంటూ న్యాయస్థానం ఎన్నడూ ఆదేశించ లేదని, ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేసి, అత్యవసరంగా ఆయనకు వైద్య సహాయం అందించాలని మాత్రమే కోరుకుందని జస్టిస్‌లు సూర్య కాంత్, ఉజ్జల్ భుయన్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఆయనకు వైద్య సహాయం అందించాలని తమ ప్రభుత్వం ప్రయత్నాలను కొనసాగిస్తున్నదని పంజాబ్ అడ్వకేట్ జనరల్ గుర్మీందర్ సింగ్ తెలిపారు. కాగా, డిసెంబర్ 20న జారీ చేసిన ఉత్తర్వులపై సమ్మతి తెలియజేస్తూ చీఫ్ సెక్రటరీ, డీజీపీలు అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం కేసును జనవరి 6వ తేదీకి వాయిదా వేసింది..
రైతుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని కేంద్రం ఎందుకు చెప్పలేకపోయిందని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోర్టు ప్రశ్నించింది. రైతులపై విధించిన నల్ల చట్టాలను కేంద్రం ఎత్తివేసిన తర్వాత ఇచ్చిన హామీల మేరకు పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటు న్యాయమైన డిమాండ్లను అమలు చేసేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలంటూ తాజాగా పిటిషన్ దాఖలైంది.