న్యూఢిల్లీ: మానసిక, శారీరక దివ్యాంగులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ సమే రైనాతో పాటు ఇతర యూట్యూబర్లకు సుప్రీంకోర్టు(Supreme Court) వార్నింగ్ ఇచ్చింది. దివ్యాంగుల మనోభావాలను కించపరిచిన ఘటనలో క్షమాపణలు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వాణిజ్యపరమైన భావస్వేచ్ఛా ప్రకటనలతో ఓ కమ్యూనిటీ మనోభావాలను దెబ్బతీయడం సరికాదు అని కోర్టు చెప్పింది. సోషల్ మీడియా ఛానళ్లలో దివ్యాంగులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని సమే రైనాతో పాటు ఇతర యూట్యూబర్లకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
జస్టిస్ సూర్యకాంత్, జోయ్మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రజల్లో అవగాహన కల్పించే రీతిలో కార్యక్రమాలు నిర్వహించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. సమే రైనాతో పాటు విపున్ గోయల్, బల్రాజ్ పరంజీత్ సింగ్ ఘాయ్, సొనాలీ థక్కర్, నిశాంత్ జగదీశ్ తన్వర్కు కూడా కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.
ఇండియాస్ గాట్ లాటెంట్ యూట్యూబ్ షోలో.. స్పైనల్ మస్క్యూలార్ అట్రోఫీ దివ్యాంగుల గురించి అనుచిత రీతిలో రైనా జోక్ చేశాడు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ క్యూర్ ఎస్ఎంఏ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా కోర్టులో పిటీషన్ వేసింది. ఇవాళ దివ్యాంగుల గురించి, రేపు మరొకరి గురించి మాట్లాడుతారని, దీని వల్ల సమాజం ఎక్కడికి వెళ్తుందని, ఇది ఎలా ముగుస్తుందని జస్టిస్ కాంత్ ప్రశ్నించారు.