న్యూఢిల్లీ, డిసెంబర్ 9: కరోనా విజృంభణ, యుద్ధం వంటి పరిస్థితుల కారణంగా చైనా, ఉక్రెయిన్ దేశాల నుంచి వచ్చేసిన అండర్గ్రాడ్యుయేట్ మెడికల్ విద్యార్థుల భవిష్యత్తుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వారికి చదువు కొనసాగే విషయంలో తగిన పరిష్కారం కనుగొనాలని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్నాథ్తో కూడిన ధర్మాసనం శుక్రవారం కేంద్ర ప్రభుత్వం, నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ)ని సూచించింది. లేనిపక్షంలో ఆయా వైద్య విద్యార్థుల భవిష్యత్తు గాడి తప్పి అగమ్యగోచరంగా తయారయ్యే ప్రమాదం ఉన్నదని పేర్కొన్నది. పలు పరిస్థితుల కారణంగా విదేశాల నుంచి వచ్చేసిన విద్యార్థుల సమస్యలకు పరిష్కారాన్ని గుర్తించేందుకు నిపుణుల కమిటీని నియమించాలని కేంద్రానికి సూచించింది. దేశ ఆస్తి అయిన విద్యార్థుల కెరీర్ను కాపాడేందుకు తమ సూచనలకు కేంద్రం ప్రాధాన్యం ఇస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నది.