న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: మత విశ్వాసాలకు సంబంధించిన విషయాలపై నిర్ణయాలు తీసుకునేటప్పుడు న్యాయమూర్తులు వ్యక్తిగత మత విశ్వాసాలకు అతీతంగా వ్యవహరించాలని, మనస్సాక్షి స్వేచ్ఛ, విస్తృత రాజ్యాంగ చట్రం ద్వారా మార్గనిర్దేశం పొందాలని సుప్రీంకోర్టు తెలియచేసింది. మతపరమైన ఆచారాలు చట్టపరమైన పరిశీలనకు లోబడి ఉంటాయని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది.
శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశ నిషేధం కేసు విచారణ సందర్భంగా శుక్రవారం తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించకుండా ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ 2018లో ఇచ్చిన తన తీర్పును సుప్రీంకోర్టు సమీక్షిస్తున్నది.
శబరిమల ఆలయ సంరక్షణ సమితి తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది గిరి 10-50 ఏండ్ల మధ్య వయసు గల మహిళలను ఆలయంలోకి అనుమతించకపోవడం అనేది ఎన్నో ఏండ్లుగా అనుసరిస్తున్న ఒక సామూహిక వివేచనగా పేర్కొన్నారు. ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేక లక్షణం ఉంటుందని, ఆ లక్షణాలను పరిరక్షించడమే పూజలో భాగమని గిరి తెలిపారు.