న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: చట్టాలు చేయడం అసెంబ్లీల పరిధిలోకి మాత్రమే వస్తుందని, ఆ ప్రక్రియలో గవర్నర్లకు ఎటువంటి పాత్ర ఉండదని రాష్ట్ర ప్రభుత్వాలు బుధవారం సుప్రీంకోర్టులో వాదించాయి. రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలియచేసేందుకు గవర్నర్లు, రాష్ట్రపతికి గడువు విధించడంపై వివిధ రాష్ర్టాలు దాఖలు చేసిన పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం బుధవారం ఏడవ రోజు విచారణ కొనసాగించింది. ధర్మాసనం పశ్చిమ బెంగాల్, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాల వాదనలు ఆలకించింది.
బిల్లులను నిరవధికంగా పెండింగ్లో పెట్టే విచక్షణాధికారం గవర్నర్లకు ఉండడాన్ని ఈ రాష్ర్టాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. పశ్చిమ బెంగాల్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు తప్పనిసరిగా సంతకం చేయాలని చెప్పారు. అసెంబ్లీ ఆమోదించిన చట్టం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే కేంద్రం ఆ చట్టాన్ని రద్దు చేయవచ్చని లేదా కోర్టులో సవాలు చేయవచ్చని ఆయన తెలిపారు. కాని ప్రజాభీష్టాన్ని గవర్నర్ అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు. తన వ్యక్తిగత సంతృప్తి ఆధారంగా గవర్నర్లు బిల్లులను పెండింగ్లో పెట్టడానికి అనుమతిస్తున్నట్లు ఆర్టికల్ 200లో ఏ నిబంధన చెప్పలేదని ఆయన వాదించారు.
బిల్లులను గవర్నర్లు అడ్డుకోవడం వల్ల కేంద్రం-రాష్ట్ర మధ్య ఘర్షణలను పెంచుతుందని, ప్రజాస్వామ్యానికి ఇది ముప్పుగా పరిణమించగలదని హిమాచల్ ప్రదేశ్ తరఫున సీనియర్ న్యాయవాది ఆనంద్ శర్మ హెచ్చరించారు. కర్ణాటక తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ సుబ్రహణ్యం కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ రాష్ర్టాలలో రెండు ప్రభుత్వ వ్యవస్థలు ఉండరాదని వాదించారు. రెండు రాజ్యాంగపరమైన పరిస్థితులలో తప్పించి గవర్నర్లు రాష్ట్ర మంత్రిమండలి సూచన మేరకు పనిచేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. కాగా, అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు నిరవధికంగా పెండింగ్లో ఉంచలేరని ధర్మాసనం నిర్దంద్వంగా తెలిపింది.