న్యూఢిల్లీ : ముంబైలో నిరుడు చోటుచేసుకున్న హిట్-అండ్-రన్ కేసులో శుక్రవారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరుతూ నిందితుడు మిహిర్ షా వేసిన పిటిషన్పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇలాంటి అబ్బాయిలకు తగిన గుణపాఠం చెప్పాల్సిందేనంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
కేసులో నిందితుడు, బైక్పై వస్తున్న వారిని అతి వేగంగా కారుతో ఢీకొట్టడమే కాకుండా, అక్కడ్నుంచి పరారయ్యాడని ధర్మాసనం పేర్కొన్నది. చేసిన నేరానికి అతడు కొద్దిరోజులపాటు జైల్లోనే ఉండాలని ఆదేశించింది. ముంబయిలోని వర్లీ ప్రాంతంలో శివసేన నేత రాజేశ్ షా కుమారుడు మిహిర్ షా మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారును వేగంగా నడుపుతూ ముందు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టాడు. దీంతో ఆ స్కూటీపై ఉన్న దంపతులు ఎగిరిపడ్డారు. వేగంవెళ్తున్న కారు పై నుంచి దూసుకుపోవటంతో కావేరి నక్వా (45) అక్కడికక్కడే మరణించింది. ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు.