Supreme Court | కశ్మీర్‌కు చెందిన లెక్చరర్ జహూర్ అహ్మద్ భట్‌పై విధించిన సస్పెన్షన్‌ను పరిశీలించాలని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు కోరింది. భట్ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టులో కొనసాగుతున్న కేసు విషయంలో హాజరై వాదనలు వినిపించారు. దీంతో ఆయనను జమ్మూ కశ్మీర్ విద్యాశాఖ ఇటీవల సస్పెండ్ చేసింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ బెంచ్‌ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా అహ్మద్ భట్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టులో విచారణకు ముందు రెండురోజులు సెలవు తీసుకున్నారని, తిరిగి వెళ్లగానే సస్పెండ్ అయ్యారని చెప్పగా.. అలా జరగాల్సింది కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. కోర్టు ముందు వాదనలు వినిపించే వ్యక్తిని ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించింది. దీనికి స్పందించి ఏజీ వెంకటరమణి సమస్యను పరిశీలిస్తామని కోర్టుకు తెలిపారు.
లెక్చరర్‌ను సస్పెండ్ చేయడానికి అనేక కారణాలున్నాయని, ఇందులో ఒకటి కోర్టుకు హాజరుకావడం అని పేర్కొన్నారు. అయితే, కోర్టుకు హాజరైన తర్వాత ఎందుకు ఉత్తర్వులు ఇచ్చారని.. కోర్టుకు హాజరైనందుకే లెక్చరర్‌ను సస్పెండ్ చేశారని సిబల్ వాదించారు. ఇది ఏమాత్రం సరికాదని, ప్రజాస్వామ్యంలో పని చేయాల్సిన పద్ధతి ఇది కాదన్నారు. కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కారణంగా ఓ వ్యక్తిని సస్పెండ్ చేస్తే.. దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని.. అదే సమయంలో టైమింగ్ సరిగా లేదని, దాన్ని పరిశీలిస్తామని ఎస్జీ మెహతా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. కేంద్రం ప్రభుత్వం రద్దు చేసిన ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ న్యాయశాస్త్రంలో పట్టా పొందిన జహూర్ అహ్మద్ భట్ స్వయంగా హాజరై ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ ఈ నెల 23న సుప్రీంకోర్టులో ఆరు నిమిషాల పాటు వాదనలు వినిపించారు. ఆ తర్వాత జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (పాఠశాల విద్య) అలోక్‌కుమార్ 25న ఆయనను దోషిగా ప్రకటించారు. సస్పెన్షన్ సమయంలో ఆయన జమ్మూ డైరెక్టర్ స్యూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో అటాచ్ చేసింది.
జహూర్ అహ్మద్ ప్రవర్తనపై విచారణ జరపాలని జమ్ములోని స్కూల్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ సుబహ్ మెహతాను ఎల్జీ ప్రభుత్వం ఆదేశించింది. సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా అహ్మద్ భట్ వాదనలు వినిపిస్తూ.. ‘జమ్మూ కశ్మీర్లో తాను ఇండియన్ పొలిటికల్స్ బోధిస్తానని, 2019 నుంచి దేశ రాజ్యాంగం గురించి బోధించడం తనకు కష్టంగా ఉంది. 2019 తర్వాత మనది ప్రజాస్వామ్యమా? అని విద్యార్థులు ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం కష్టం. ఆర్టికల్ 370ని రద్దు చేయబోమని ఆగస్టు 4న అప్పటి గవర్నర్ సత్యపాల్ మాలిక్ హామీ ఇచ్చినా.. అర్ధరాత్రి రాత్రి కర్ఫ్యూ విధించారు. మాజీ సీఎంలను నిర్బంధించారు. ప్రత్యేక హోదాను రద్దు చేయడమే కాకుండా రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం భారత రాజ్యాంగ నైతికతను ఉల్లంఘించడమే. ప్రజల సమ్మతిని పరిగణనలోకి తీసుకోకుండా జమ్మూ కశ్మీర్, లడఖ్‌లను విభజించడం ప్రజాస్వామ్యం కల్పించిన హక్కులకు విరుద్దం. ఈ చర్య సహకార ఫెడరలిజం, రాజ్యాంగానికి వ్యతిరేకం’ అంటూ వాదనలు వినిపించారు.