న్యూఢిల్లీ, జూలై 16: సీబీఎస్ఈ పాఠ్యప్రణాళికలో భాగంగా 9వ తరగతిలో తృతీయ భాషను ప్రవేశపెట్టడాన్ని సుప్రీంకోర్టు గురువారం ప్రశ్నించింది. బోర్డు పరీక్షలకు ముందు ఇలా చేయడం వల్ల విద్యార్థులపై అనవసరమైన ఒత్తిడి పడుతుందని జస్టిస్ బీవీ నాగరత్న ఈ సందర్భంగా పేర్కొన్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విధానం అన్న కారణంతో కేంద్ర విద్యా విధానాన్ని వ్యతిరేకించవద్దని తమిళనాడుకు సుప్రీంకోర్టు సూచించింది. రాష్ట్రంలో మూడు భాషల విధానాన్ని అనుసరించే జవహర్ నవోదయ విద్యాలయాల(జేఎన్వీ)పై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని న్యాయస్థానం పేర్కొంది.
ప్రతి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయాల స్థాపనకు సహకరించాలని రాష్ర్టాన్ని ఆదేశిస్తూ మద్రాసు హైకోర్టు జారీచేసిన ఉత్తర్వును సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలుపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కేవలం 9వ తరగతిలో మాత్రమే మూడవ భాషను ఎందుకు ప్రవేశపెట్టాలని జస్టిస్ నాగరత్న ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ చర్యను జస్టిస్ నాగరత్న పూర్తిగా వ్యతిరేకిస్తూ 10వ తరగతి బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఇప్పటికే తీవ్రమైన విద్యాపరమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు. 9వ తరగతి చాలా ఒత్తిడిగా ఉంటుంది. 9వ తరగతిలోనే కొత్త భాషను ఎందుకు ప్రవేశపెట్టాలి? 6వ తరగతిలో ప్రవేశపెట్టండి అని న్యాయమూర్తి సూచించారు.