హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): సామ్యవాద, లౌకిక విలువలను పునరుద్ఘాటిస్తూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ప్రకటించడం గర్వకారణమని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్ హర్షం ప్రకటించారు. రాజ్యాంగ పీఠికలో లౌకిక, సామ్యవాద పదాలను తొలగించాలని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి సహా కొందరు లాయర్లు వేసిన పిటిషన్లను తిరస్కరిస్తూ ధర్మాసనం ఇచ్చిన తీర్పు స్వాగతించతగినదని తెలిపారు. ఈ తీర్పు రాజ్యాంగంలోని న్యాయం, సమానత్వం వంటి ముఖ్య సిద్ధాంతాలను పునరుద్ఘాటించిందని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ తీర్పు సాంఘిక, ఆర్థిక సమానత్వాన్ని, మత సామరస్యాన్ని మరింత బలపరుస్తుందనే ఆశాభావం వ్యక్తంచేశారు. సమానత్వం, సాంఘిక న్యాయానికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నదని స్పష్టంచేశారు. తాజా పిటిషన్ల వెనుక ఉన్న ఉద్దేశం రాజ్యాంగ పునాది విలువలను దెబ్బతీయడం మాత్రమేనని విమర్శించారు.